ఇళ్ల పట్టాల దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలి: సీఎం జగన్‌ | Spandana Programme YS Jagan Mohan Reddy Video Conference With Collectors | Sakshi
Sakshi News home page

ఇళ్ల పట్టాల దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలి: సీఎం జగన్‌

Published Wed, Sep 22 2021 11:46 AM | Last Updated on Wed, Sep 22 2021 6:58 PM

Spandana Programme YS Jagan Mohan Reddy Video Conference With Collectors - Sakshi

సాక్షి, అమరావతి: నెల రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్‌ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు లే అవుట్ల వారీగా వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెండింగ్‌ దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలని తెలిపారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌​ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లోగా చేయాలన్నారు. లే అవుట్లలో విద్యుత్‌, నీటి వసతిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. వారానికొకసారి ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు సమీక్ష చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

హౌసింగ్‌:
నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారమవుతాయని ఆశిస్తున్నానని సీఎం జగన్‌ తెలిపారు. పెండింగ్‌ కేసుల్లో 395 కేసులు తాత్కాలిక స్టేలు ఉన్నాయని చెప్పారు. వాటిపైన కూడా దృష్టిపెడితే.. పేదలకు మేలు జరుగుతుందని, లే అవుట్‌ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్‌ చేశామని అన్నారు. ప్రభుత్వం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలని తెలిపారు. లే అవుట్ల వారీగా వివరాలు తెలపాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. దాని వల్ల మిగిలిన ప్లాట్లను కొత్తగా లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుందన్నారు. మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్‌ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగ్‌ ఉంటే వెంటనే వెరిఫికేషన్‌ పూర్తి చేయాలన్నారు. 

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
లబ్ధిదారులకు ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి  డిసెంబర్‌లో పట్టాలు అందించాలన్నారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్‌లో చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌ అయ్యాయని, అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్‌మెంట్‌ లెవల్‌ ఇళ్లను బేస్‌మెంట్‌లెవల్‌పై స్థాయికి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

ఆప్షన్‌ -3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని, ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలన్నారు. లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. సిమెంటు, బ్రిక్స్, ఐరన్‌ స్టీల్, మెటల్‌.. వాటి వినియోగం విపరీతంగా పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని తెలిపారు. ఆప్షన్‌ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని తెలిపారు. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. 

కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సమీక్ష చేయాలన్నారు. మున్సిపాలిటీ స్థాయి, మండలాల స్థాయి, పంచాయతీల స్థాయి, లే అవుట్‌ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై రివ్యూ చేయాలన్నారు. అలా చేయగలిగితేనే వేగంగా నిర్మాణాలు సాగుతాయని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే అక్కడ సమస్యలు ఏంటో తెలుస్తాయన్నారు.  పెద్ద లే అవుట్లలో నిర్మాణసామగ్రిని ఉంచడానికి, సైట్‌ ఆఫీసులకోసం గోడౌన్లను నిర్మించాలని తెలిపారు. ఉపాధిహామీ పనుల కింద ఈ గోడౌన్లను నిర్మించాలని సీఎం పేర్కొన్నారు. 

ఉపాధి హామీ
సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, బీఎంసీయూలు, డిజిటల్‌ లైబ్రరీల పనులు చురుగ్గా సాగాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం ఇవ్వని బిల్లులకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తోందని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఖర్చు చేశామని తెలిపారు. నిధులకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన కూడా దృష్టి పెడుతున్నామని తెలిపారు. కలెక్టర్లు ఈ పనులపై దృష్టిపెట్టి ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డిజిటల్ లైబ్రరీలు
డిసెంబర్‌ 31 నాటికల్లా 4,530 పంచాయతీల్లో ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. అన్‌ లిమిటెడ్‌ బ్యాండ్‌ విడ్త్‌, వర్క్‌ ఫ్రం హోం సౌకర్యం గ్రామాల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆలోగా డిజిటల్‌ లైబ్రరీలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు
విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమైనవని, అలసత్వం వహించిన వారిపై చర్యలకూ వెనుకాడమని సీఎం జగన్‌ అన్నారు. కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్‌ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పని సరిగా సందర్శించాలన్నారు. 

స్వయంగా రంగంలోకి సీఎం
వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని చెబుతామని సీఎం జగన్‌ అన్నారు. డిసెంబర్‌ నుంచి తాను కూడా సచివాలయాలను సందర్శిస్తూ ప్రతి పర్యటనలో సచివాలయాలను చూస్తానని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో మార్గదర్శకాలు కూడా ఇచ్చామని పేర్కొన్నారు.ప్రతి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలిపి బృందాలుగా ఏర్పడి ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేలా ఆ గ్రామంలో పర్యటించాలని చెప్పామని అన్నారు.

ప్రతినెలా చివరి శుక్రవారం, చివరి శనివారం సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం, సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలు, ముఖ్యమైన ఫోన్‌ నంబర్లతో కూడిన పాంప్లెట్లను వారికి అందించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలని తెలిపారు. నిర్దేశించుకున్న రోజుల్లోగా అర్హులైన వారికి మంజూరు జరగాలని సీఎం జగన్‌ సూచించారు.

కోవిడ్, సీజనల్‌ వ్యాధులు
కోవిడ్‌ తీవ్రత తగ్గిందని, ఉద్ధృతంగా ఉన్న కాలంలో పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉందని తెలిపారు. ప్రస్తుతం 2.5 శాతం కన్నా తక్కువగా ఉందని, రికవరీ రేటు కూడా 98.63శాతంగా ఉందని పేర్కొన్నారు. కోవిడ్‌ పట్ల ఎలాంటి అలసత్వం వద్దని, 2 డోసుల వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తయ్యేంతవరకూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కోవిడ్‌ పట్ల నిర్లక్ష్యం వద్దని సీఎం అధికారులకు సూచించారు. కోవిడ్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లఘించే వారికి కఠినంగా వ్యవహరించాలని, జరిమానాలు విధించాలని తెలిపారు. మాస్కులు వినియోగించకపోతే కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 104 నంబర్‌  అనేది వన్‌స్టాప్‌ సొల్యూషన్‌గా నడవాలని, 104 నంబర్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రతివారం కూడా 104 నంబర్‌ పనితీరుపై సమీక్ష చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

ధర్డ్ వేవ్ సన్నద్ధత
థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో తెలియదని కానీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ అన్నారు. టీచింగ్‌ ఆస్పత్రులు, ఆస్పత్రుల్లో కావాల్సిన పరికరాలను, మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాల్లోని టీచింగ్‌ ఆస్పత్రులకు జాయింట్‌ కలెక్టర్‌ హౌసింగ్‌ను అడ్మిన్‌ ఇన్‌ఛార్జిగా నియమించాలని అన్నారు. నవంబర్‌ 15 నుంచి విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. డిప్యుటేషన్లను పూర్తిగా రద్దు చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ డిప్యుటేషన్లకు అనుమతి ఇవ్వొద్దన్నారు. 100 బెడ్లకు మించి ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఉంచేలా చూడాలని సీఎం జగన్‌  అధికారులకు సూచించారు.

వ్యాక్సినేషన్‌
నవంబర్‌ 30 నాటికి 3.5 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ ఇవ్వగలుగుతామని సీఎ జగన్‌ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రజలందరికీ పూర్తిగా 2 డోసులు ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌పైనా కలెక్టర్లు దృష్టిసారించాలని, రెండో డోసును సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా, టైఫాయిడ్‌ వ్యాధులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. 

దిశ యాప్‌
దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని, ఫోన్‌ను షేక్‌ చేస్తే చాలు 6 నిమిషాల్లోగా మహిళకు భద్రత కల్పించేలా దిశ యాప్‌ను తీర్చిదిద్దామని సీఎం జగన్‌ అన్నారు. దిశ యాప్‌ ద్వారా మహిళల్లో విశ్వాసాన్ని నింపగలిగామని, 70,00,520 మంది ఇప్పటివరకూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. ఇందులో 3,78,571 ఎస్‌ఓఎస్‌ రిక్వెస్టులు వచ్చాయని, ఇందులో చర్యలు తీసుకోదగ్గవి 4,639 అని అన్నారు. మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్‌ స్టోరీలు దిశ యాప్‌ ద్వారా ఉన్నాయని తెలిపారు. ఏదైనా జరగకముందే మహిళలకు అండగా నిలిచామని, సగటున 6 నిమిషాల్లోగా దిశ బృందం బాధితులను చేరుకుంటుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఛార్జిషీటు వేయడానికి సగటున 300 రోజులు పడితే, ఇప్పుడు 42 రోజుల్లోగా ఛార్జిషీటు వేస్తున్నామని చెప్పారు.

పోలీసు విభాగం అత్యద్భుతంగా పనిచేస్తోందని, మహిళల మీద నేరాల్లో 2 నెలల్లోపు ఛార్జిషీటు వేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉందని తెలిపారు. 91శాతం 2 నెలల్లోపే ఛార్జిషీటు వేస్తున్నామని, దిశ కార్యక్రమాన్ని కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు, వాలంటీర్లు ఉన్నారని తెలిపారు.  గ్రామంలోని ప్రతి ఇంట్లో కూడా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా దిశ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిని ప్రోత్సహించాలని, ఎప్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదైనా ఎలాంటి ఇబ్బంది లేదని తలిపారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదైతే మనం విధులను సక్రమంగా నిర్వర్తించడానికి వీలుంటుందని సీఎం జగన్‌ తెలిపారు. 


వ్యవసాయం
ఇ క్రాపింగ్‌పై కలెక్టర్లు దృష్టిసారించాలని, కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు 10శాతం ఇ-క్రాపింగ్‌ను తనిఖీలు చేయాలన్నారు. జేడీఏలు, డీడీఏలు 20శాతం క్రాపింగ్‌ను తనిఖీ చేయాలని, అగ్రికల్చర్‌ అధికారులు, హార్టికల్చర్‌ అధికారులు 30 శాతం ఇ- క్రాపింగ్‌ను తనిఖీ చేయాలని సీఎం జగన్‌ సూచించారు. ఇ- క్రాపింగ్‌ అనేది చాలా ముఖ్యమని, ఇ- క్రాపింగ్‌ కింద డిజిటల్, ఫిజికల్‌ రశీదులు ఇవ్వాలన్నారు. ఇ- క్రాపింగ్‌ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు.  ల్యాండు వివరాలు, డాక్యుమెంట్ల కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని, అగ్రికల్చర్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిల్లో సమావేశాలు జరగాలని, ఆర్బీకే స్థాయి సమావేశాల్లో వస్తున్న అంశాలపై మండలస్థాయిలో, మండలస్థాయిలో వస్తున్న అంశాలపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలన్నారు.

జిల్లా స్థాయిల్లో వస్తున్న అంశాలపై విభాగాధిపతులు, కార్యదర్శులు దృష్టిపెట్టాలని సూచించారు. క్రాప్‌ ప్లానింగ్‌పైన అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో దృష్టిపెట్టాలని, ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా చర్చించాలని తెలిపారు.  ఆర్బీకేల పనితీరు, సీహెచ్‌సీల పనితీరుపైనా చర్చించాలని పేర్కొన్నారు. ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులపైనా అడ్వైజరీ కమిటీలకు అవగాహన కల్పించే కార్యక్రమంపై దృష్టిపెట్టాలని తెలిపారు. ప్రైవేటు వ్యాపారులు, వారి దుకాణాలపై పరిశీలన చేయాలని, నాణ్యమైనవి అమ్ముతున్నారా? లేదా?ధరలు అదుపులో ఉన్నాయా? లేదా? పరిశీలన చేయాలని సూచించారు.

ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు
ఆర్బీకేల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఉంచుతున్నారని, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? రైతులకు వారి నుంచి సేవలు అందుతున్నాయా? లేవా? అన్నదానిపై పరిశీలన చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే వాటిని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుందన్నారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలని, వారిని ఇ- క్రాపింగ్‌తో లింక్‌చేశామని తెలిపారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా, పంటలకు ధరలు కల్పించడం వంటివన్నీ కూడా కౌలు రైతులకు అందాలని తెలిపారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీ అని తెలిపారు.  

అక్టోబరులో ప్రభుత్వ పథకాలు 
విజయదశమి రోజున ఆసరా పథకం అమలు అవుతుందని, అక్టోబరు 7 నుంచి 10 రోజలు పాటు ఆసరా పథకంపై అవగాహన, చైతన్య కార్యక్రమాలుఉంటాయని సీఎం జగన్‌ తెలిపారు. అవగాహన, చైతన్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సహా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.  ఆసరా చెక్కుల పంపిణీయే కాకుండా ఆసరా, చేయూత, దిశలు మహిళా సాధికారిత దిశగా ఏ విధంగా అడుగులు వేశామో వారికి చెబుతారని వివరించారు. ఆసరా, చేయూత ద్వారా జీవితాలను మెరుగుపరుచుకున్న వారి విజయాలను మహిళలకు వివరిస్తారని అన్నారు. మండలం ఒక యూనిట్‌గా ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

రూ. 6500 కోట్లలను వైయస్సార్‌ ఆసారా కింద ఇస్తున్నామని, దాదాపు 80 లక్షల మందికిపైగా మహిళలు లబ్ధిపొందుతారని చెప్పారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం ‘క్లాప్‌’ అక్టోబరు 1న ప్రారంభం అవుతుందని, అక్టోబరు 19న జగనన్న తోడు కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, అక్టోబరు 26న రైతులకు ‘వైయస్సార్‌ సున్నావడ్డీ రుణాలు’ కార్యక్రమం దాంతో పాటు ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అమలు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

పరిషత్ ఎన్నికల్లో విజయంపై
ప్రభుత్వ పరిపాలను బాగా జరుగుతున్నందు వల్లే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను అమలు చేయడంలో కలెక్టర్లు దగ్గరనుంచి వాలంటీర్‌ వరకూ అందరూ బాగా పనిచేస్తున్నారని అన్నారు. మంచి పనితీరు కనపరచడం వల్లే ప్రజల ఆదరాభిమానాలు పొందుగలుగామని తెలిపారు. అవినీతి లేకుండా పథకాలు అమలవుతున్నాయని, వివక్షకు తావు లేకుండా అర్హులకు ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. 
 

చదవండి: 

రాజకీయ నేతలకు భిన్నంగా విద్యకు సీఎం జగన్‌ ప్రాధాన్యం

పెట్టుబడులు పెట్టండి.. రాష్ట్రంతో పాటు మీరూ వృద్ధి చెందండి: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement