పవిత్రమైన బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు చేసి.. స్వర్ణాల చెరువులో నిలువెల్లా నీటిలో మునిగి నిష్కల్మషమైన మనస్సులో కోరిన రొట్టెను స్వీకరిస్తే కోర్కెలు నెరవేరుతాయని కుల,మతాలకు అతీతంగా భక్తుల విశ్వాసం. ఏటా మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల పాటు రొట్టెల పండగ జరుగుతుంది. తొలినాళ్లలో ఏడాదికి ఒక్క రోజే జరిగే ఈ పండగపై భక్తుల్లో నమ్మకం పెరగడంతో ఏడాదికేడాది భక్తుల రాక ద్విగుణీకృతం కావడంతో విశిష్టతగా మారింది. రొట్టెల పండగకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. రెండున్నర శతాబ్ద కాలంగా నిర్విఘ్నంగా సాగుతున్న రొట్టెల పండగకు ఈ ఏడాది కరోనాతో బ్రేక్ పడింది. ఈ దఫా కేవలం మత పెద్దల సమక్షంలో మొహర్రం వేడుకలు నిర్వహిస్తున్నారు.
నెల్లూరు సిటీ: నెల్లూరు రొట్టెల పండగకు దేశ, విదేశాల్లో విశిష్టత ఉంది. రెండున్నర శతాబ్దాలుగా నమ్మకానికి, మత సామరస్యానికి, ప్రతీకగా రొట్టె ల పండగ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా, జిల్లాకే తలమానికంగా జరుగుతోంది. రొట్టెల పండగకు దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేవారు. కోర్కెన రొట్టెను పట్టుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతటి విశిష్టమైన రొట్టెల పండగకు కరోనా విపత్తు అడ్డంకిగా మారింది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండగ నిర్వహించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగానే కాక.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విశృంఖలం కావడంతో పండగ నిర్వహణను ఈ ఏడాదికి నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దర్గా వద్దకు భక్తులు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పండగ విశిష్టత..
రోట్టెల పండగకు సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గాలోని షహీద్‌లను (అమరులను) దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భక్తులు తరలివ స్తుంటారు.
♦బారాషహీలను స్మరిస్తూ తమ కోర్కెలను తీర్చుకోవాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు.
♦కోరిన కోర్కెలు తీరిన తర్వాత ఆ రొట్టెను వదులుతారు. మరో కోరిక రొట్టెను పట్టుకుని వెళ్తారు.
♦విద్య, ఉద్యోగం, ఉద్యోగన్నతి, వ్యాపారం, ధన, వివాహం, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, స్వగృహం, విదేశీయానం ఇలా... వివిధ కోర్కెల రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు.
♦మతసామరస్యాలకు అతీతంగా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఏటా పది లక్షల నుంచి 12 లక్షలు మంది భక్తులు హాజరవుతుంటారు.
♦గతంలో ఒక్క రోజే పండగ జరిగేది. ఆ తర్వాత మూడు రోజుల పాటు నిర్వహించే వారు. క్రమేపీ ఐదు రోజులు పండగగా మారింది.
♦2015లో రొట్టెల పండగకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది.
♦సుమారు 250 ఏళ్ల నుంచి స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెల పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకునే వారు.
♦మొదటిసారి కరోనా కారణంగా ఈ ఏడాది పండగను నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
షహీద్‌లు కొలువున్న చోటే బారాషహీద్ దర్గా
టర్కీ నుంచి మహ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా సుమారు 250 ఏళ్ల క్రితం 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు.
♦ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్‌లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగింది.
♦ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్ బేగ్‌తో పాటు మరో 11 మంది వీర మరణం పొందారు.
♦వారి తలలు గండవరంలో తెగి పడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి.
♦వీర మరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు.
♦12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్ అనే పేరొచ్చింది.
తలలు తెగిపడిన చోట
గండవరంలో జరిగిన పవిత్ర యుద్ధంలో మత ప్రచారకుల 12 మంది తలలు తెగి పడ్డాయి. వాటిలో 7 మాత్రమే లభ్యమయ్యాయి. అవన్నీ సమాధులుగా మారిన చోటే నేడు సాతోషహీద్ (సాత్ అంటే ఏడు, షహీద్ అంటే అమరులు) దర్గాగా పిలువబడుతుంది.
షహదత్‌తో ప్రారంభం
మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహద్‌త్‌తో ప్రారంభవుతుంది. తర్వాత రోజు గంధమహోత్సం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. తహలీల్ ఫాతెహాతో పండగ ముగుస్తుంది.
కోర్కెలు తీరిన భక్తులు మళ్లీ పండగలో రొట్టెను వదలాల్సిందే
తమ కోర్కెలు తీరాలని రొట్టెలు పట్టుకునే వారు.. కోర్కెలు తీరితే ఆ రొట్టెను మళ్లీ పండగలో వదిలాలి. స్వర్లాల చెరువు వద్దకు వచ్చి రొట్టెల మార్పిడి చేసుకునేవారు. అయితే ఏడాది రొట్టెల పండగకు భక్తులను అనుమతించకపోవడంతో కోర్కెలు తీరిన భక్తులు రొట్టెను వదిలేందుకు వీలు లేకపోవడంతో ప్రశ్నార్థకంగా మారింది. కరోనా నేపథ్యంలో ప్రాణాలు ముఖ్యం కాబట్టి భక్తులు ప్రభుత్వం ఆదేశాలను పాటించడం మంచిదని మత పెద్దలు చెబుతున్నారు. రొట్టెలను పేదలకు దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందని, తర్వాత ఏడాది అదే సంకల్పంతో నెరవేరిన కోర్కెల రొట్టెలను వదులుకోవచ్చునని మత పెద్దలు చెబుతున్నారు.
రొట్టెలను దానం చేస్తే పుణ్యం
ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండగ ఈ ఏడాది జరగకపోవడం బాధాకరం. ప్రాణాంతకమైన వైరస్ కరోనా కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం. భక్తులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. కోర్కెలు తీరిన భక్తులు ఈ ఏడాది పేదలకు రొట్టెలను దానం చేయడం ద్వారా పుణ్యం వస్తుంది. ఆ తర్వాత ఏడాదిలో మీ సంకల్ప రొట్టెలను వదులుకోవచ్చు.
30వ తేదీ – షహదత్
31వ తేదీ – గంధమహోత్సవం
01వ తేదీ – రొట్టెల పండగ
02వ తేదీ – తహలీల్ ఫాతెహా
03వ తేదీ – ముగింపు సభ
(ఈ ఏడాది లేదు)
Comments
Please login to add a commentAdd a comment