కరోనాను ‘పల్స్’‌ పట్టేస్తుంది | Special Story On Pulse Oximeter | Sakshi
Sakshi News home page

కరోనాను ‘పల్స్’‌ పట్టేస్తుంది

Published Mon, Aug 17 2020 10:02 AM | Last Updated on Mon, Aug 17 2020 10:02 AM

Special Story On Pulse Oximeter - Sakshi

కరోనా వైరస్‌ సోకిన వారికి ఆక్సిజన్‌ ప్రధాన సమస్యగా మారుతోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా రోగి తీసుకునే ఆక్సిజన్‌ సరైన మోతాదులో రక్తంలో చేరకపోవడంతో శ్వాస తీసుకునేప్పుడు సమస్య ఉత్పన్నమై మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రక్తంలో సరైన మోతాదులో ఆక్సిజన్‌ ఉందా.. లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎంతో కీలకం. కరోనా ముప్పును ముందుగా గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సీమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది. ఈ తరుణంలో పల్స్‌ ఆక్సీమీటర్‌ ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిందే. 

పెద్దదోర్నాల/పుల్లలచెరువు/చీరాల అర్బన్‌: శరీరంలో ఆక్సిజన్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా కరోనా ముప్పును ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అత్యంత సులువుగా వినియోగించే ఈ పరికరం ఇప్పుడు ప్రతి ఇంటిలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సోకి చికిత్స పొందుతూ ముఖ్యంగా హోం ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్న వారు తరచుగా రక్తంలోని ఆక్సీజన్‌ స్థాయి తెలుసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు.  

పల్స్‌ ఆక్సీమీటర్‌ పనిచేసే విధానం 
ఈ పరికరాన్ని ప్రతి ఒక్కరూ చాలా సులువుగా ఉపయోగించొచ్చు. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్‌ పెట్టి బటన్‌ నొక్కితే చాలు ఆన్‌ అవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత డిస్‌ప్లేలో ఆక్సిజన్‌ శాతం పల్స్‌ రేటును చూపిస్తోంది. ఈ రీడింగ్‌ ఆధారంగా రోగులను వర్గీకరించి చికిత్స అందించొచ్చు.  

రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి ఇలా 
రక్తంలో ఎంత మోతాదులో ఆక్సిజన్‌ సరఫరా అవుతుందో పల్స్‌ ఆక్సీమీటర్‌ గుర్తిస్తుంది. సాధారణంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ 95–100 వరకు ఉంటుంది. పల్స్‌ రేటు 60–100 మధ్య ఉండాలి. ఆక్సిజన్‌ స్థాయి 90 శాతం కన్నా తక్కువ పడిపోయినా, గుండె పల్స్‌ రేటు 100 కన్నా పెరిగినా రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భావిస్తారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తుల్లో ఉండే ఆక్సిజన్‌ లెవల్స్‌ 95 పైన ఉంటే తక్కువ లక్షణాలు ఉన్నట్లు, వీరిని ఇంటి వద్ద ఉంచి చికిత్సను అందిస్తారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ 90 నుంచి 94 మధ్య ఉంటే మధ్యస్తంగా ఉన్నట్లు.. వీరిని వైద్యశాలకు తరలించాల్సి వస్తుంది. 90 కన్నా తక్కువ పడిపోతే ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌ వైద్యం అందించాలి. 

పల్స్‌ఆక్సీమీటర్‌ ఎంతో ఉపయోగపడుతుంది   
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పల్స్‌ఆక్సీమీటర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ ఏ మేరకు ఉన్నాయో తెలియపరుస్తుంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా ఆక్సిజన్‌ లెవల్స్‌ను అంచనాలు వేసి చికిత్స అందిస్తారు. కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం అతి పెద్ద సమస్య. రక్తంలోకి చేరే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. వేగంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగులు తరచూ పల్స్‌ఆక్సీమీటర్‌ ద్వారా ఆక్సిజన్‌శాతం సరిచూసుకోవడం మంచిది. 
డాక్టర్‌ పి.కమలశ్రీ. పీపీపీ యూనిట్, చీరాల ఏరియా వైద్యశాల

హైపోక్సియాను గుర్తిస్తుంది 
ప్రస్తుత పరిస్థితుల్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం పెద్ద సమస్య. దీంతో రక్తంలో చేరే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగుల్లో చాలా మందికి ఆక్సిజన్‌ శాతం 87.88 ఉన్నా ఆయాసంగా ఫీలవ్వరు. అలాంటప్పుడు దానిని హ్యాపీ హైపోక్సియా అంటారు. ఇదే పెద్ద ప్రమాదకరం. ఇలాంటప్పుడు పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో తరచూ పరిశీలించుకోవాలి. ఆరు నిమిషాలు నడిచిన తర్వాత పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పరీక్షించుకుంటే 94 శాతం కన్నా తక్కువగా ఉంటే అతనికి ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ అందడం లేదని గుర్తించాలి. అలాంటివారు వెంటనే వైద్యశాలలో చేరాల్సి ఉంటుంది. వారికి ఆక్సిజన్‌ స్థాయి పడిపోతున్న విషయం తెలియదు. ఫలితంగా ఒకటి రెండ్రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కరోనా మరణాల్లో ఎక్కువగా ఇలానే జరుగుతున్నాయి. హైపోక్సియాను వెంటనే గుర్తించి వైద్యశాలకు వెళ్లగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. గ్రామాల్లో ప్రతి ఆరోగ్య కార్యకర్త వద్ద ఈ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పల్స్‌ రేటును చూసుకుని ముందు జాగ్రత్తలు తీసుకునే విధానం ఉంది.  
డాక్టర్‌ గౌతమి,పుల్లలచెరువు, ప్రభుత్వ వైద్యాధికారి   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement