కడుపులో బిడ్డ.. కళ్ల ముందు జీవశ్చవంలా భర్త.. | Ongole Man Suffering From Black Fungus Waits For Help | Sakshi
Sakshi News home page

కడుపులో బిడ్డ.. కళ్ల ముందు జీవశ్చవంలా భర్త..

Published Mon, May 17 2021 9:11 AM | Last Updated on Mon, May 17 2021 1:58 PM

Ongole Man Suffering From Black Fungus Waits For Help - Sakshi

చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీను- (ఇన్‌సెట్‌)లో బ్లాక్‌ ఫంగస్‌తో కనుగుడ్డు తీసివేసిన దృశ్యం 

ఒంగోలు టౌన్‌: బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడినవారి బతుకు చీకటి మయమవుతోంది. కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వ్యక్తి శరీరంలోని షుగర్‌ లెవల్స్‌పై బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తోంది. ఒంగోలులోని సీతారాంపురంలో నివాసముంటున్న పందిపంట్ల శ్రీను అనే యువకుడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ బారినపడి ఒక కనుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఫంగస్‌ ఇంకా శరీరంలోనే ఉండటంతో రెండో కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి.. చివరకు ఒక కన్నును కూడా కోల్పోయాడు. ప్రస్తుతం చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి దాదాపు రూ.18 లక్షల వరకు ఖర్చువుతుందని చెప్పడంతో శ్రీను భార్య మాలతి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆరో నెల గర్భిణి అయిన మాలతి కందుకూరులోని తన తండ్రి వద్ద ఉంటోంది. తల్లి చనిపోవడంతో తండ్రి వద్దనే ఉంటోంది.

తిరగని ఆస్పత్రి లేదు... 
శ్రీను కరోనా బారిన పడటంతో గత నెల 21వ తేదీ కందుకూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వారం రోజుల తర్వాత 28వ తేదీ డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత నుంచి కుడి కన్ను వాసి ఎర్రగా ఉండటంతో కందుకూరులోని ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళితే కంటిలో రక్తం గడ్డ కట్టిందని హైదరాబాద్‌ వెళ్లాలని వైద్యుడు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్, నిమ్స్‌ హాస్పిటల్, సరోజినిదేవి హాస్పిటల్, కోఠిలోని ఈఎన్‌టీ హాస్పిటల్స్‌  చుట్టూ తిరిగారు. అయితే కరోనా కేసులు ఉండటంతో అక్కడ చేర్చుకోలేదు.

చివరకు యశోద హాస్పిటల్‌లో జాయినై ఎంఆర్‌ఐ, బ్రెయిన్, సిటీ స్కాన్‌ చేసిన తర్వాత మెదడుకు ఇన్‌ఫెక్షన్‌ పాకిందని, అర్జంట్‌గా చెన్నై తీసుకువెళ్లాలని  వైద్యులు సూచించారు. ఈనెల 12వ తేదీ చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని గుర్తించిన వైద్యులు వెంటనే యాంటీ ఫంగస్‌ ఇంజక్షన్లు చేశారు. ఆ ఫంగస్‌ బ్రెయిన్‌కు కూడా పాకడంతో 18వ తేదీ ఆపరేషన్‌ చేసి కుడి కన్నుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఇన్‌ఫెక్షన్‌ ఎడమ కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దానికితోడు బ్రెయిన్‌కు కూడా ఫంగస్‌ వ్యాపించడంతో అబ్జర్వేషన్‌లో ఉంచారు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.. 
చెన్నైలోని సిమ్స్‌ హాస్పిటల్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడాలంటూ మాలతి వేడుకుంటోంది. వైద్యానికి మొత్తం రూ.18లక్షల ఖర్చవుతుందని, ఎవరైనా దాతలు సాయంచేసి తన భర్త ప్రాణాలను కాపాడాలని కోరుతోంది. ఆరునెలల గర్భిణి యిన మాలతి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం కంటే, కంటి ముందే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న భర్త ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తోంది. సాయం చేయాలనుకునేవారు 7794896521 నంబర్‌ను సంప్రదించవచ్చు 

చదవండి: గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య 
మాయమాటలతో బాలికను మభ్యపెట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement