సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు ఉండటంతో ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. తాజాగా విదేశాల్లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్లు మొదలుకావడం, అంతర్జాతీయంగా కోవిడ్ ఆంక్షలు సడలించడంతో దరఖాస్తులు ఊపందుకున్నాయి. కోవిడ్ సమయంలో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలతో పాటు తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 300 చొప్పున దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. అంటే మూడింటిలో కలిపి 900 మాత్రమే అందేవి.
ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కో కేంద్రంలో 500 చొప్పున రోజుకు 1,500 వరకు స్లాట్‌లు విడుదల చేస్తున్నారు. అలాగే 22 పోస్టాఫీసుల నుంచి రోజుకు వెయ్యి స్లాట్‌లు ఇస్తున్నారు. అంటే రోజుకు మొత్తమ్మీద 2,500 స్లాట్‌లు లభిస్తున్నాయి. అయినప్పటికీ 20 రోజుల పాటు వెయిటింగ్ లిస్టు వస్తోంది. దరఖాస్తుల్లో 40 శాతం విద్యార్థులవే కావడం గమనార్హం. కెనడా, అమెరికా, యూకే దేశాలకు చదువుల నిమిత్తం వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అదేవిధంగా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడిన పిల్లలను చూసేందుకు, వాళ్లకు ప్రసవ సమయంలో తోడ్పాటు అందించేందుకు వెళ్తున్న తల్లిదండ్రుల సంఖ్య సైతం పెరిగింది.
దరఖాస్తు మరింత సరళతరం
దరఖాస్తుదారులకు పాస్‌పోర్టును మరింత చేరువ చేసేందుకు నిబంధనలను సరళతరం చేశారు. జనన ధ్రువీకరణకు ఎస్‌ఎస్‌సీ, చిరునామా ధ్రువీకరణకు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ) ఉంటే పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఆరేడు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదని పాస్‌పోర్టు అధికారులు తెలిపారు.
ఏజెంట్లను, నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మొద్దు
పాస్‌పోర్టు దరఖాస్తుల కోసం ఏజెంట్లను ఆశ్రయించవద్దు. మేం ఎలాంటి ఏజెంట్లనూ గుర్తించడం లేదు. నకిలీ వెబ్‌సైట్ల వల్ల చాలామంది నష్టపోతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారులు కేవలం www. passportindia. gov. in వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఏవైనా అనుమానాలుంటే ఈ వెబ్‌సైట్ నుంచే తెలుసుకోవచ్చు. అత్యవసరం లేనివారు తత్కాల్ కింద బుక్ చేసుకోవద్దు.
– డీఎస్‌ఎస్ శ్రీనివాసరావు, రీజనల్ పాస్‌పోర్టు అధికారి, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment