AP: Srikakulam Girl To Pradhan Mantri Rashtriya Bal Puraskar - Sakshi
Sakshi News home page

Pradhan Mantri Rashtriya Bal Puraskar: సాహసానికి సెల్యూట్‌.. ఉగ్రమూకతో పోరాడిన హిమప్రియ  

Published Sun, Jan 23 2022 12:10 PM | Last Updated on Sun, Jan 23 2022 2:33 PM

Srikakulam Girl To Pradhan Mantri Rashtriya Bal Puraskar - Sakshi

శ్రీకాకుళం రూరల్‌/శ్రీకాకుళం న్యూకాలనీ: 2018 ఫిబ్రవరి 10.. జమ్మూ ప్రాంతంలోని ఆర్మీ క్వార్టర్స్‌.. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది.. ఉదయం ఐదు గంటల సమయం. చిక్కటి చలిలో.. చీకటిలో ఆదమరిచి నిద్ర పోతున్న మనుషులంతా ఆ రోజు తూటా చప్పుళ్లకు ఉలిక్కిపడి లేచారు. ఇంకా చీకటి ఉండగానే ఉగ్రమూక ఆ క్వార్టర్స్‌పై దాడికి తెగబడింది. నాలుగైదు గంటల పాటు ఆపకుండా తూటాల వర్షం కురిపిస్తూనే ఉంది. ఆ భీకర దాడిలో ఓ బాలిక అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించింది.

ఆర్మీ జవానైన తండ్రి ఆ సమయంలో ఇంటిలో లేకపోయినా ఉగ్రవాదులకు ఎదురెళ్లింది. ఒంటి నిండా దెబ్బలు తగిలినా వెరవకుండా తన తల్లితో పాటు తోటి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఆమె పేరు గురుగు హిమప్రియ. తల్లి పద్మావతి. తండ్రి పేరు గురుగు సత్యనారాయణ. ఆర్మీ జవాన్‌. ఈ దాడి సమయంలో ఆయన అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం రూరల్‌ మండలం, పొన్నాం గ్రామం. ఈ సాహసాన్ని అప్పట్లోనే కేంద్రం గుర్తించింది.

రక్షణమంత్రి అభినందనలు అందుకుని.. 
హిమప్రియ ధైర్యసాహసాలు తెలుసుకున్న నాటి రక్ష ణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ జమ్ములోని ఆర్మీ క్వార్టర్స్‌కు వెళ్లి, హిమప్రియ ఇంటిని సందర్శించి ఆ బాలికను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు. అప్పటికి హిమప్రియ వయసు 8 ఏళ్లు. ఇప్పు డు ఆ బాలికకు ప్రభుత్వం ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ అవార్డు ప్రకటించినట్టు కలెక్టర్‌ శ్రీకే ష్‌ బి.లాఠకర్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

జాతీయ బాలికా దినోత్సవం రోజున..  
ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో భారత ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాది గురుగు హిమప్రియ ఎంపికైంది. బాలిక ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వర్చువల్‌ విధానంలోధ్రువీకరణపత్రం, రూ.లక్ష నగదు అందుకోనుంది. ఈ కార్యక్రమం ఈ నెల 24 ఉదయం 11.30 గంటల నుంచి వెబ్‌ కాస్ట్‌ ద్వారా హెచ్‌టీటీపీఎస్‌://పీఎంఇండియా వెబ్‌కాస్ట్‌.ఎన్‌ఐసీ.ఇన్‌/ లేదా దూరదర్శన్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు, ముఖ్యంగా పాఠశాల/కళాశాలల విద్యార్థులు వీక్షించాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ విజ్ఞప్తి చేశారు.

హ్యాట్సాఫ్‌ హిమప్రియ.. 
హిమప్రియ 2019లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అవార్డు అందుకున్నారు.
ఆర్మీకి సంబంధించిన ఓ పుస్తకంలో ఆమె ధైర్యసాహసాలను వివరిస్తూ ఓ వ్యాసం ప్రచురితమైంది.
నాటి ఘటనలో బాలిక తల్లికి చేయి పూర్తిగా దెబ్బతింది. హిమప్రియ భుజానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం హిమప్రియ పూణేలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెవెన్త్‌ చదువుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement