కొండలపై పెరిగిన ఔషధమొక్కలే ఆయన వైద్యానికి ఆధారం. ఏ మొక్క ఏ రోగాన్ని నయం చేస్తుందన్నది తండ్రి నుంచి నేర్చుకున్నారు. వనమూలికా వైద్యంపై పట్టుసాధించారు. ప్రకృతితో మమేకమవుతూ పచ్చనికొండల్లో వనమూలికలతో కూడిన వైద్యం అందిస్తున్నారు. ఎముకల వైద్యంలో సిద్ధహస్తుడిగా పేరుపొందారు. ఆయనే.. సంగంవలస సత్యనారాయణ. ఆయన అందిస్తున్న ఉచిత ప్రకృతి వైద్యసేవలపై ఈ వారం ‘సాక్షి’ సండే స్పెషల్.
పార్వతీపురం టౌన్: సంగంవలస.. పార్వతీపురం జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరం. ఆ ఊరి పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ఆ గ్రామంలో అందించే వనమూలికలతో కూడిన వైద్యసేవలు. ప్రకృతి వైద్యంతో ఎముకలు సరిచేయడంలో ఆ గ్రామ ప్రకృతి వైద్యుడు బడే సత్యనారాయణ పేరుపొందారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన.. తన తండ్రి స్వామినాయుడు నుంచి నేర్చుకున్న వైద్యాన్ని వారసత్వంగా స్వీకరించారు.
మానవ శరీరంలోని ఎముకల అమరికపై పట్టుసాధించారు. ఆ జ్ఞానంతోనే కట్లు వేస్తున్నారు. కొండలపై లభించే వనమూలికలతో తయారుచేసిన మందులను రోగులకు అందజేస్తున్నారు. ఆయన వద్దకు వైద్యం కోసం వచ్చేవారికి ఉచిత సేవలతో సాంత్వన కలిగిస్తున్నారు. ఇప్పుడు ఆయన సేవలు ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రతిరోజు ఆయన వద్దకు వివిధ వైద్యసేవల కోసం సుమారు వందమంది వస్తుండడం గమనార్హం. రోగుల నమ్మకమే దీనికి ప్రధానం.
ఇతర ప్రాంతాల నుంచి..
సత్యనారాయణ వద్ద వైద్యం పొందేందుకు జిల్లా వాసులే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి కూడా రోగులు వస్తున్నారు. ప్రతిరోజు రోగుల తాకిడి ఉంటుంది. ఆది, బుధవారాల్లో అధికమంది వైద్యం కోసం ఆశ్రయిస్తున్నారు.
వెదురు బద్దలతోనే...
విరిగిన ఎముకలకు వెదురు బొంగులను బద్దలుగా చీల్చి దన్నుగా నిలుపుతారు. వనమూలికలతో తయారుచేసిన పసర నూనెలో దూది ముంచి విరిగిన ప్రాంతంలో వేసి గుడ్డతో గట్టిగా కట్టుకడతారు. నొప్పి తగ్గేందుకు కొండలపై దొరికే ఔషధ మొక్కల ఆకులు, వేర్లుతో తయారుచేసిన మాత్రలు అందజేస్తారు. ఇలా నాలుగు పర్యాయాలు కట్లువేసి విరిగిన ఎముకలు అతికేలా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment