సాక్షి, నరసన్నపేట( శ్రీకాకుళం): మండల కేంద్రం నరసన్నపేటలోని హనుమాన్ కూడలి సమీపంలో జాతీయ రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. మృతురాలు బారువ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న వాడవలస అప్ప లనాయుడు భార్య వసంతకుమారి (48)గా గుర్తించారు. అరసవల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఈమె స్వగ్రామం పాతపట్నం మండలం పెద్ద సరియాపల్లికి కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
సర్వీస్ రోడ్డుపై ఉన్న స్పీడ్ బేకర్ల వద్దకు వచ్చేసరికి బైకుపై వెనుక కూర్చొ న్న వసంతలక్ష్మి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయా రు. అదే సమయంలో వెనుకనుంచి ఐరెన్ ప్లేట్స్‌తో వస్తున్న కంటైనర్ లారీ వసంతకుమారి పైనుంచి వెళ్లడంతో నడుము భాగం నుజ్జవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వసంతకుమారిని తప్పించేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుమారుడు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
కుమారుడి కళ్ల ముందే...
‘నేనంటే అమ్మకు ఎంతో ప్రేమ. నా కళ్ల ముందే అమ్మ చనిపోయింది. వెనుక వస్తున్న లారీ కొన్ని సెకెన్లు ఆలస్యంగా వచ్చినా అమ్మ బతికేది. బయటకు వెళ్లే ప్రమాదాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెప్పేది. ఎప్పుడూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేది. ఇప్పుడిలా విగత జీవిగా మారింది. అదీ నా కళ్ల ముందే ఇలా జరిగిందేంటి దేవుడా.. ’ అని కుమారుడు గౌతమ్ రోదించడం అక్కడివారికి కంటతడి పెట్టించింది. వసంతకుమారికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
స్తంభించిన ట్రాఫిక్..
ప్రమాదానికి కారణమైన లారీ రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో శ్రీకాకు ళం నుంచి టెక్కలి పైపుకు వెళ్లే మార్గంలో వాహనాలు రెండు కిలోమీటర్ల మేర గంటన్నర పాటు బారులు తీరాయి. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో వచ్చి లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోర్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment