దొంగతనం జరిగినా.. బాంబు బెదిరింపు వచ్చినా.. ప్రముఖుల పర్యటనకు విచ్చేసినా ఆ ప్రదేశాల్లో ముందుగా కనిపించేది పోలీస్ జాగిలం. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా.. ఆధారాల సేకరణలో కీలకంగా వ్యవహరిస్తోంది సిక్కోలు భైరవ సేన. రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చూపి సిక్కోలు ఖ్యాతిని పెంచుతోంది ఈ ‘ఐదో సింహం’.
సాక్షి,శ్రీకాకుళం: శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాలది కీలక పాత్ర. ఆధారాల సేకరణలో, పేలుడు పదార్థాల గుర్తింపులో శిక్షణ పొందిన శునకాలు పోలీసులకు సహకరిస్తున్నాయి. పోలీసు తరహా తరీ్ఫదు పొంది ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ నేరాల నియంత్రణకు తోడ్పాటునందిస్తున్నాయి. జిల్లా పోలీస్ శాఖలో 8 జాగిలాలు సేవలందిస్తున్నాయి. అందులో కైరో, లైకా అనే రెండు జాగిలాలు ఈ నెల 5 నుంచి 19 వరకు మంగళగిరిలో జరిగిన కెనైన్ అండ్ డాగ్ హ్యాండ్లర్ రిఫ్రెష్ కోర్సులో ప్రతిభను చూపాయి. రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కైరో నేరపరిశోధన విభాగంలో.. లైకా పేలుడు పదార్థాల అన్వేషణలో ప్రతిభను చాటాయి. ఈ నేపథ్యంలో సిక్కోలుకు సేవలందిస్తున్న జాగిలాల ఆహార్యం.. ఆహారం.. ఆరోగ్యం.. ఇతర అంశాలపై ‘సాక్షి’ కథనం.
వీఐపీ డాగ్.. లైకా..
చిత్రంలోని ఈ జాగిలం పేరు లైకా. 2019లో పుట్టింది. లాబ్రాడర్ జాతికి చెందిన శునకం. హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం శ్రీకాకుళం పోలీస్ శాఖలో చేరింది.
స్పెషలైజేషన్: పేలుడు పదార్థాలు పసిగట్టడంలో నేర్పరి. వీవీఐపీల బందోబస్తులో కీలకం. అతిథులు ఎవరైనా జిల్లాను సందర్శిస్తున్నారంటే లైకా రంగంలోకి దిగుతుంది. మంగళగిరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానాన్ని సాధించింది.
ఆహారం
నెలకు ఒక్కో జాగిలం ఆహారం కోసం రూ.5 వేల నుంచి రూ.6 వేలు వెచ్చిస్తారు. ప్రత్యేకంగా తయారు చేసే రోయల్ కెనైన్ ఆహారం అందజేస్తారు.
ఆవాసం
ఎచ్చెర్ల ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక డాగ్ హౌస్ ఉంది. ప్రతి జాగిలానికి ఒక గదిని కేటాయిస్తారు. పూర్తి సదుపాయాలతో ఆ గది ఉంటుంది.
ఆరోగ్యం
వీటి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. చురుకుదనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంటారు.
మరిన్ని ప్రత్యేకతలివే..
►ప్రతి డాగ్‌కు ఒక హ్యాండ్లర్‌ను కేటాయి స్తారు. వీటి శిక్షణ, వసతి, ఆరోగ్యం, ఇతర కార్యక్రమాలన్నీ హ్యాండ్లర్ పర్యవేక్షిస్తారు.
►వీటి సేవలు జిల్లాకే పరిమితం కాదు. అవసరమైతే పక్క జిల్లాలకు కూడా వినియోగిస్తారు.
పరిశోధన పుట్ట.. కైరో
చిత్రంలోని చురుగ్గా చూస్తున్న ఈ డాగ్ పేరు కైరో. 2018లో పుట్టింది. డాబర్ మేన్ జాతికి చెందినది. హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ అనంతరం శ్రీకాకుళం డాగ్‌స్కాడ్‌లో చేరింది.
స్పెషలైజేషన్: నేర పరిశోధన కోసం ఈ జాగిలాన్ని వినియోగిస్తున్నారు. జిల్లాలోని కీలకమైన కేసులు పరిశోధనలో పోలీస్‌శాఖకు సాయపడింది.
ట్రాక్ రికార్డ్..
పలాసలో బాలుడి హత్య, రాజాంలో వ్యక్తి హత్య, శ్రీకాకుళంలో వివిధ చోరీ కేసుల్లో నిందితుల అన్వేషణలో కైరో సమర్థంగా సేవలందించింది.
2020లో రాష్ట్రవ్యాప్తంగా మంగళగిరిలో జరిగిన పోలీస్ డాగ్ నైపుణ్య పరీక్షల్లో గోల్డ్ మెడల్ సాధించింది. పోలీస్ శాఖలో కైరోకు మంచి గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సైతం నేరపరిశోధన విషయంలో కైరో సేవల్ని వినియోగిస్తున్నారు.
నిరంతరం నైపుణ్య శిక్షణ..
జిల్లాలోని ఎనిమిది జాగిలాలకు ఉదయం, మధ్యా హ్నం రెండు గంటల పాటు శిక్షణ ఉంటుంది. మారుతు న్న సాంకేతిక పరిజ్ఞానం, నేరాలకు అనుగుణంగా స్టేట్ ఇంటెలిజన్స్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంది. ముఖ్యంగా నేర పరిశోధన, పేలుడు పదార్థాల అన్వేషణలో తరీ్ఫదు ఉంటుంది. డాగ్‌స్కా్వడ్ పనితీరును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు.
– శిస్టు రాజేశ్వరరావు, డాగ్ స్క్వాడ్ హ్యాండ్లర్
Comments
Please login to add a commentAdd a comment