Police Dogs: బాంబులను పసిగట్టి..  నేరగాళ్ల పనిపట్టి... | Hyderabad Police Dogs Special Training At Moinabad | Sakshi
Sakshi News home page

అపరిచితులు ఆహారం పెట్టినా ముట్టవు.. చిటికెలో జాడ పట్టేయగలవు..

Published Sat, Feb 18 2023 10:14 AM | Last Updated on Sat, Feb 18 2023 4:23 PM

Hyderabad Police Dogs Special Training At Moinabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, నేరగాళ్ల జాడలను చిటికెలో పట్టేస్తాయి... కదులుతున్న వాహనాల్లోంచి సైతం దూకి ‘టార్గెట్‌’ను అడ్డుకుంటాయి... శిక్షకుడి కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతోపాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి... ఎన్నిసార్లు మొరగమంటే అన్నిసార్లే మొరుగుతాయి... ఇదీ మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైౖ నింగ్‌ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణ పొందిన పోలీసు జాగిలాల సామర్థ్యం.

ఎనిమిది నెలల సుదీర్ఘ శిక్షణ అనంతరం ఐదు జాతులకు చెందిన 48 జాగిలాలు, 64 మంది శిక్షకుల 22వ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ తాజాగా ఐఐటీఏలో జరిగింది. వీటిలో 36 జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందినవి కాగా మిగిలిన 12 అరుణాచల్‌ప్రదేశ్‌వి. ఈ నేపథ్యంలో పోలీసు జాగిలాలపై ప్రత్యేక కథనం.  

సగం సమయం మచ్చిక కోసమే... 
ప్రతి పోలీసు జాగిలానికీ ఇద్దరు వరకు హ్యాండ్లర్స్‌ ఉంటారు. జాగిలాన్ని ఎంపిక చేసుకున్నప్పుడే వీరినీ ఎంపిక చేస్తారు. జాగిలంతో కలిపే వీరికి సైతం శిక్షణ ఉంటుంది. మొత్తం 8 నెలల శిక్షణా కాలంలో 2 నెలలు హ్యాండ్లర్‌కు జాగిలానికీ మధ్య సఖ్యత కలి్పంచడానికి, మరో 2 నెలలు జాగిలాన్ని హ్యాండ్లర్‌ మచి్చక చేసుకోవడానికి కేటాయిస్తారు. మిగిలిన నాలుగు నెలల్లోనే వివిధ రకాల శిక్షణ ఇస్తారు. 

శిక్షణలో 4 రకాలు..
లాబ్రడార్, జర్మన్‌ షెపర్డ్, బెల్జియం మలినాయిస్, బీగల్, గోల్డెన్‌ రిట్రీవర్, డాబర్‌మ్యాన్, కోకోర్‌ స్పానియల్‌ జాతి శునకాల్లోని సహజ లక్షణాలు, పనితీరు, సమకాలీన అవసరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు విభాగాల్లో శిక్షణ ఇస్తుంటారు. ఒక రకమైన సేవలకు తర్ఫీదు పొందిన జాగిలం మరో పనికి ఉపకరించదు. పేలుడు పదార్థాలు/అనుమానిత వస్తువుల గుర్తింపు, నేర పరిశోధన, మాదకద్రవ్యాల గుర్తింపు, ముష్కరులపై దాడి చేసే సామర్థ్యంలో 4 నెలలపాటు శిక్షణ 48 జాగిలాలకు సాగింది. 

జాతీయ భాషలోనే కమాండ్స్‌...
జాగిలాలకు ఇచ్చే కమాండ్స్‌లో 95 శాతం హిందీలోనే ఉంటాయి. కేవలం రెండు మాత్రం ఆంగ్లంలో ఉంటాయి. ఎదుటి వారికి నమస్కరించడానికి ‘సెల్యూట్‌’, పడుకొని గుండ్రంగా దొర్లడానికి ‘రోల్‌’పదాలు వినియోగిస్తారు. వీటితోపాటు అరుదుగా మాత్రమే సిట్, కమ్, స్టాండ్‌ వంటి ఆంగ్ల పదాలు వాడుతున్నారు.  

మరికొన్ని ప్రత్యేకతలు... 
ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్ని సైతం ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్‌ లేదా మాస్టర్‌ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా ఈ శిక్షణ ఇస్తారు. 
చైనా, పాకిస్తాన్‌ తదితర దేశాల పటాల మధ్య ఉన్న ఇండియా మ్యాప్‌ను స్పష్టంగా గుర్తించడంతోపాటు రెండు కాళ్లు పైకెత్తి నమస్కరిస్తాయి. వాటి జ్ఞాపక, సంగ్రహణ శక్తులకు ఉదాహరణ ఇది. 
పాకిస్తాన్‌ లోని అబోటాబాద్‌లో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ కనుగొనడంలో అమెరికా నేవీ సీల్స్‌కు దోహదపడ్డ బెల్జియం మలినాయిస్‌ జాతి జాగిలాలు రాష్ట్ర పోలీసు విభాగంలోనూ ఉన్నాయి. 2015 నుంచి అందుబాటులోకి వచి్చన వీటిని మాదకద్రవ్యాలను గుర్తించేందుకు శిక్షణ ఇచ్చి, వినియోగిస్తున్నారు. 
మాదకద్రవ్యాలను పసిగట్టేందుకు బీగల్‌ జాతి జాగిలాలను అందుబాటులోకి తీసుకువచి్చన తొలి పోలీసు విభాగంగా తెలంగాణ రికార్డులకెక్కింది. 
ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపా విభాగమైన ఆక్టోపస్‌లో 2015 నుంచి బెల్జియం మలినాయిస్‌ జాగిలాలను వాడుతున్నారు.  

ఈ జాగిలాలకు పెట్టే పేర్లు, హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలు (కమాండ్స్‌/కాషన్స్‌) గరిష్టంగా మూడు అక్షరాలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటిలో అత్యధికం రెండు అక్షరాలతో కూడినవే ఉంటాయి. జాగిలం గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు, తక్కువ సమయంలో ఆదేశం పూర్తి చేయడానికి ఈ ప్రమాణాలను నిర్దేశించుకున్నారు.
చదవండి: మెట్రోకు సమ్మర్‌ ఫీవర్‌.. పగుళ్లకు కోటింగ్‌..పట్టాలకు లూబ్రికేషన్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement