సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్æ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకం కానుంది.
సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు భావనపాడుకే ఉన్నాయని మారిటైమ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు.. థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి ఈ పోర్టు కేంద్రం కానుంది.
ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్.. ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి కీలకమైన భావనపాడు పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేయడం ద్వారా ప్రారంభించనున్నారు.
తొలి దశలో నాలుగు బెర్తులు
తొలి దశలో భావనపాడు పోర్టును నిరి్మంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361.91 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనులను రూ.2,949.70 కోట్లతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనతో తొలి దశ ఉంటుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా, తొలి దశలో నాలుగు బెర్తులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు.
నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ రూపంలో సమకీరించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది.
పోర్టు సిటీగా శ్రీకాకుళం
భావనపాడుతో శ్రీకాకుళం జిల్లా పోర్టు సిటీగా మారుతుంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో మచిలీపట్నం పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే స్ఫూర్తితో భావనపాడు పోర్టు పనులు కూడా లక్ష్యంలోగా పూర్తి చేస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
రూ.35 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
భావనపాడు పోర్టు నిర్వాసితులు 594 మంది కోసం రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నౌపడలో అధునాతన వసతులతో అర్‌అండ్‌ఆర్ కాలనీ నిరి్మంచనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఈ నెల 19న భావనపాడు పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఇప్పటి వరకు మూలపేట, విష్ణుచక్రంలో రైతుల నుంచి 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. రైతులకు 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. దీంతో పాటు మొదటి ఫేజ్‌లో సీఆర్‌జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు.. మొత్తం 1000 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండో ఫేజ్‌లో బృహత్తర పోర్టు డెవలప్‌మెంట్‌కు మరికొన్ని భూములు రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఆర్‌అండ్ ఆర్ కాలనీకి ఈ నెల 11న ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ వచి్చందన్నారు. జిల్లా ప్రజల పోర్టు కల నెరవేరుతుండడం శుభ పరిణామమన్నారు.
వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం
మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రూ.365 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం తీరంలో నిరి్మంచనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచి్చన ప్రతి హామీని సీఎం నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, హార్బర్లు లేక మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితిని సీఎం పూర్తిగా మార్చేస్తున్నారన్నారు.
విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు సమానంగా భవిష్యత్‌లో ఇక్కడ తీరం అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరులో హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉందని, బాపట్ల, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి వద్ద మరో హార్బర్ నిర్మాణంతో పాటు మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను హార్బర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మే 3న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌లో పూర్తి స్థాయి ప్రగతి సాధిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారు అప్పుడప్పుడూ కనిపిస్తూ మత్స్యకారుల కోసం మాట్లాడుతుంటారని, అలాంటి పార్ట్‌టైమ్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment