తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవంతో స్వామివారు వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహనాల్లో ఊరేగి అలసిసొలసిన శ్రీవారు స్నపన తిరుమంజనం సేవలో సేద తీరారు. జీయర్లు, ఆలయ అర్చకుల నేతృత్వంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వైదికంగా పూజా కైంకర్యాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు సాగింది. అనంతరం మంగళవాయిద్యాల నడుమ, వేదపండితుల వేదఘోష, అశేషభక్త జన గోవింద నామస్మరణల మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశయైన సుదర్శన చక్రత్తాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. భక్తులు సైతం ఈ పుష్కరిణిలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. కాగా, తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఆగమ శాస్త్రం ప్రకారం గరుడపతాకాన్ని కిందకు దించి బ్రహ్మోత్సవాలు ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment