తిరుమల: తిరుమల ఆలయం వద్ద పటిష్ట భద్రత కోసం ఆక్టోపస్ బృందాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లను బుధవారం తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆక్టోపస్ అధికారులతో కలిసి డీఐజీ పరిశీలించారు.
అనంతరం డీఐజీ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయ ప్రవేశమార్గం వద్ద ఏర్పాటుచేసే ఈ చాంబర్లో ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ఆక్టోపస్ బృందం.. ఒక సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో అత్యాధునిక ఆయుదాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, డే విజన్ గ్లాసెస్, ఇతర అత్యాధునిక పరికరాలు ధరించి శత్రువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఐదు నుంచి ఆరుగురు చొప్పున నిరంతరాయంగా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు.
వీరు శ్రీవారి ఆలయ ముఖద్వారాన్ని ప్రధానంగా రక్షిస్తారని తెలిపారు. ఎప్పుడైనా అకస్మాత్తుగా శత్రువులు ఎక్కువమంది దాడి చేసేందుకు ప్రయతి్నస్తే వీరితో పాటు వెంటనే బ్యారెక్‌లోని మరో 20 మంది ఆక్టోపస్ సిబ్బందికి సమాచారం అందుతుందని వారు కాలినడకన ఇక్కడకు చేరుకుని శత్రువును ఎదుర్కొనేలా భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.
అత్యాధునిక భద్రతా దళం.. ఆక్టోపస్
రాష్ట్రంలో ఉగ్రవాదం, మత కలహాలను అణచివేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ విభాగం ‘ఆపరేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ (ఆక్టోపస్). దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ 2007, అక్టోబర్ 1న నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అత్యుత్తమ సాయుధ బలగాల తరహాలో ఆక్టోపస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ నుంచి మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జీ కమాండోల తరహాలో శిక్షణనిస్తారు.
గ్లోక్–19 పిస్టల్స్, కోల్ట్ 9ఎంఎం ఎస్‌ఎంజీ, ఫ్రాంచి స్పాస్–15 డ్యూయల్ మోడ్ షాట్‌గన్స్, స్నైపర్ రైఫిల్స్, టేజర్ గన్స్, కార్నర్ షాట్స్ సిస్టం మొదలైన అత్యాధునిక ఆయుధాలతో విజయవంతంగా దాడులు చేయడంలో వీరు నిష్ణాతులు. ఉగ్రవాదులు ఎలాంటి దుశ్చర్యలకు యతి్నంచినా మెరుపువేగంతో తిప్పికొట్టగల సామర్థ్యం ఆక్టోపస్ సొంతం.
Comments
Please login to add a commentAdd a comment