మొగల్రాజపురం(విజయవాడ తూర్పు)/అంబాజీపేట: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న స్టాఫ్ నర్సు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. మచిలీపట్నం ఆంధ్రా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న పద్మజ శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో అదే ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఫిట్స్‌లా వచ్చి కళ్లు తిరిగి కింద పడిపోయింది. శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఏర్పడింది. తీవ్ర అస్వస్థత పాలైన ఆమెను వెంటనే అదే ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స అందజేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని తెలిపారు.
వారి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్ల నాని ఆరా..
కరోనా వ్యాక్సిన్‌తో అస్వస్థతకు గురైన స్టాప్ నర్సు, జి.కొండూరు అంగన్‌వాడీ వర్కర్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆరా తీశారు. స్టాఫ్ నర్సు పద్మజ ఆరోగ్య పరిస్థితిని కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఎంవో డాక్టర్ సహాసినిని ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు.ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని డీఎంహెచ్‌ఎంవో తెలిపారు. అంగన్‌వాడీ ఆయాకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశించారు.
వ్యాక్సిన్ తీసుకున్న వారానికి ల్యాబ్ టెక్నీషియన్ మృతి
ఇదిలా ఉండగా, వ్యాక్సిన్ తీసుకున్న ఓ ల్యాబ్ టెక్నీషియన్ వారం తరువాత మరణించిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అంబాజీపేట మండలంలోని మాచవరం అగ్రహారం శివారు అంబేడ్కర్ నగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సరెళ్ల శ్రీనివాస్(45) ఈ నెల 22న అమలాపురం ఏరియా ఆస్పత్రిలో కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఉన్నట్టుండీ శుక్రవారం అతను కన్నుమూశాడు. వ్యాక్సిన్ వికటించడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. 24వ తేదీ నుంచి జ్వరంతోపాటు ఒంటిపై దద్దుర్లు వచ్చాయని చెప్పారు. దీనిపై అమలాపురం అడిషనల్ డీఎంహెచ్‌వో పుష్కరరావు, వైద్యాధికారి డీవీ సత్యంలు మృతుడి ఇంటికెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వ్యాక్సిన్ వల్ల చనిపోయాడా లేదా అనే విషయం తెలుస్తుందని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment