కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ | State Cabinet approves new Dia from Wall proposal | Sakshi
Sakshi News home page

కొత్త డయాఫ్రమ్‌ వాల్‌

Published Fri, Jul 26 2024 5:57 AM | Last Updated on Fri, Jul 26 2024 5:57 AM

State Cabinet approves new Dia from Wall proposal

సమాంతరంగా నిర్మిం చాలన్న నిపుణుల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం 

పోలవరం పూర్తికి అవసరమైనన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం 

దీన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపాలని నిర్ణయం 

గతంలో బాబు నిర్వాకం వల్లే దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌  

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయా ఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కొత్త డయా ఫ్రమ్‌ వాల్‌ను నిర్మించాలని కేంద్ర జల్‌ శక్తి శాఖను కోరుతూ తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం ఇస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో హామీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. 

ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. వీటిని కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపాలని నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు పనులను జూన్‌ 30 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. 

సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ కుశ్వీందర్‌ వోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గోదావరి వరదల ఉధృతికి గ్యాప్‌–2లో డయా ఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని, దానికి మరమ్మతులు చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందని చెప్పలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా దెబ్బ తిన్న డయా ఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనకు ఆమోదం తెలిపింది.

2023 జూన్‌ 5నే నిధులు మంజూరు 
» కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో దక్కించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్‌ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌ వేను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయా ఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు.

»    2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరదలు.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయా ఫ్రమ్‌ వాల్‌ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గరిష్టంగా 36 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి.

»    వెఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్‌ ప్రోటోకాల్‌ ప్రకారం స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్‌ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా 6.1 కి.మీల పొడవున మళ్లించారు. ఆ తర్వాత దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేశారు. కోతకు గురై దెబ్బ తిన్న డయా ఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామని వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదన మేరకు.. 2022 మార్చి 4న అప్పటి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. 

»    చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల దెబ్బ తిన్న డయా ఫ్రమ్‌ వాల్‌ పునరుద్దరణ, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దెబ్బ తిన్న డయా ఫ్రమ్‌ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. 

»   వాటిని పరిగణనలోకి తీసుకుని.. రెండు దశల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన కేంద్రం.. వైఎస్‌ జగన్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, డయా ఫ్రమ్‌ వాల్‌ పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.2 వేల కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్‌ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీ చేశారు.

నాడు వద్దంటూ.. నేడు నిధుల విడుదలకు ప్రతిపాదన
»  గత ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైనన్ని నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో ఆదేశించారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పలుమార్లు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కొత్త డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంతోపాటు తొలి దశ పూర్తికి రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు 
ప్రతిపాదించారు. 

»  ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే.. 2016 సెప్టెంబర్‌ 6న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రూ.15,667.90 కోట్లు ఇవ్వా­లని 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 

»   ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15,146.28 కోట్లు విడుదల చేసింది. దీనికితోడు రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణ­యాన్ని కేంద్ర కేబినెట్‌ మారుస్తూ తీర్మానం చేయాలి. ఆ మేరకు తీర్మానం చేసి.. నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జల్‌ శక్తి శాఖ ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. 

»    అయితే అప్పటికే ఎన్‌డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవిలో ఊదారు. దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు తీర్మానం చేయించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement