
సాక్షి, అమరావతి: రాష్ట ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) పంచాయతీ ఎన్నికల షెడ్యూలును సవరించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సోమవారం నోటిఫికేషన్లు జారీచేసి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5కు బదులు 9న ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఈనెల 25న మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి నాలుగు దశల్లో వచ్చేనెల 17 నాటికి ఎన్నికలు ముగిస్తామని నిమ్మగడ్డ ఈనెల 23న ప్రకటించి నోటిఫికేషన్ జారీచేశారు. అయితే, ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరగనందున మొదటి దశ ఎన్నికలను చివరి దశకు మారుస్తూ రీ షెడ్యూలు చేశారు.
కోవిడ్–19 వ్యాక్సినేషన్ జరుగుతున్నందున ఎన్నికలను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం, అలాగే.. సమయం లేకపోవడంవల్ల జిల్లాల్లో మొదటి దశ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. కానీ, ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో సోమవారం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసినట్లు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో జరుగుతాయి.
ఫిబ్రవరి 17తో ముగియాల్సిన ఎన్నిక ప్రక్రియ 21తో ముగుస్తుంది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 5న జరగాల్సిన తొలి దశ ఎన్నికలు సవరించిన షెడ్యూలు ప్రకారం చివరి దశలో ఫిబ్రవరి 21న జరుగుతాయి. అలాగే, రెండో దశ ఎన్నికలు సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశలో జరుగుతాయి. మూడో దశవి రెండో దశగానూ, నాలుగో దశవి మూడో దశగానూ జరుగుతాయి. కాగా, కోర్టు కేసులు ఉన్న.. పరిపాలనా, న్యాయపరమైన కారణాలవల్ల ఎన్నికల నిర్వహణకు వీల్లేని గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీచేయరాదని ఎస్‌ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సవరించిన షెడ్యూలు ప్రకారం..
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 51 రెవెన్యూ డివిజన్ల పరిధిలో నాలుగు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. కొన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలోని కొన్ని మండలాల్లో ఒక దశలోనూ, మరికొన్ని మండలాల్లో మరో దశలోనూ ఎన్నికలు జరుగనున్నాయి.
► తొలి దశ కింద 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 173 మండలాల్లో ఫిబ్రవరి 9న పోలింగ్ జరుగుతుంది.
► రెండో దశలో 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 169 మండలాల్లో 13న..
► మూడో దశలో 19 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 171 మండలాల్లో 17న..
► నాలుగో దశలో 14 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 146 మండలాల్లో 21న పోలింగ్ జరుగుతుంది.