సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు కొనసాగుతుండగానే పురపాలక పోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెర తీయడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. నిజానికి ఈ ఎన్నికలు గత ఏడాది మార్చిలోనే జరగాల్సినా నామినేషన్ల దశలో కరోనా సాకుతో కమిషన్ వాయిదా వేయడం తెలిసిందే. ఏ పార్టీ సత్తా ఏమిటో తేలేందుకు పుర సమరం వేదిక కానుంది. పార్టీ గుర్తులపై జరిగే ఈ పోరులో ప్రజాబలం ఎవరి వైపు అనేది మళ్లీ రుజువు కాబోతోంది. సంక్షేమాన్ని ఆశీర్వదిస్తున్న ప్రజల నుంచి మరోసారి జనామోదాన్ని వైఎస్సార్‌సీపీ ఆకాంక్షిస్తోంది. ఉనికి కాపాడుకోవాలన్న ఆరాటం టీడీపీ నాయకత్వంలో కనిపిస్తోంది.
సంక్షేమానికి పట్టం..
తాజా రాజకీయ పరిణామాలు పురపాలక ఎన్నికల్లో ప్రభావం చూపుతాయనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచీ ప్రజాక్షేత్రంలోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల్లో బలాన్ని పెంచుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల నుంచి 2019 ఎన్నికల దాకా తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల తీర్పు తర్వాత మరోసారి పార్టీ గుర్తుపై వైఎస్సార్‌సీపీ ఎన్నికలకెళ్తోంది. రెండేళ్లలో అధికార పార్టీకి సానుకూలతే కానీ ప్రతికూలత ఏమాత్రం కనిపించడం లేదు. సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేయడం, అవినీతి రహిత పాలన, ప్రతీ పేదవాడికి మేలు జరిగేలా పథకాలు, సచివాలయ వ్యవస్థను విప్లవాత్మక మార్పులుగా జనం హర్షిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారు కూడా తమవైపు మళ్లారని వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. అత్యధిక పంచాయతీలను తమ పార్టీ అభిమానులు గెలుచుకోవడమే దీనికి నిదర్శమని స్పష్టమవుతోంది. పార్టీలకతీతంగా సాగుతున్న సంక్షేమాన్ని టీడీపీ కేడర్ కూడా స్వాగతిస్తోంది. దీన్నిబట్టి గత అసెంబ్లీ ఎన్నికల కన్నా భారీ ఓట్లను అధికార పార్టీ సాధించడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
జనంలోకి ఎలా..? టీడీపీలో అయోమయం
టీడీపీ ఆది నుంచీ పోల్ మేనేజ్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితికి ఇదే కారణమని ఆ పార్టీ క్యాడర్ వ్యాఖ్యానిస్తోంది. సంక్షేమాన్ని వ్యవస్థల ద్వారా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ పర్యవసానం పంచాయతీ ఎన్నికల్లో చవిచూసింది. ఎన్నికల్లో నిలబడేందుకు కూడా గ్రామాల్లో ఆ పార్టీ కేడర్ ముందుకు రాని దుస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఒరవడితో పోటీ పడలేమని టీడీపీ శ్రేణులు ఆ పార్టీ పెద్దలకే తేల్చి చెప్పాయి. జారిపోతున్న క్యాడర్, నమ్మకం కోల్పోయిన శ్రేణులు, క్షేత్రస్థాయి వాస్తవాలను అంగీకరించకుండా చంద్రబాబు మభ్యపుచ్చే యత్నాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలను ఎదుర్కోకుండా పంచాయతీ ఎన్నికలను తెరపైకి తెచ్చి చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారనే విమర్శలు టీడీపీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లు కూడా దక్కడం కష్టమేనని, అదే జరిగితే తమ క్యాడర్ కట్టలు తెంచుకుని వెళ్లిపోవడం ఖాయమన్న సంకేతాలున్నాయని పేర్కొంటున్నారు.
మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు..
Published Tue, Feb 16 2021 4:13 AM | Last Updated on Tue, Feb 16 2021 11:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment