
నిర్వాసిత కాలనీల్లో సాగుతున్న పాదయాత్ర
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో అంతిమ విజయం కార్మికులదే అని ఉక్కు పోరాట కమిటీ చైర్మన్, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్.నరసింగరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం రిలే దీక్షా శిబిరం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్, కణితి, వడ్లపూడి ప్రధాన రహదారుల మీదుగా రిలే దీక్షా శిబిరం వరకు పాదయాత్ర సాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారనుందని చెప్పారు. ఢిల్లీ పెద్దలను కదిలించే స్థాయిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్‌లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు జరుగుతున్న కుట్రను జాతీయస్థాయిలోని బీజేపీయేతర పార్టీల పార్లమెంటరీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.