జగనన్న విద్యా దీవెన: అన్నా.. మీకు రుణపడి ఉంటాం | Students And Parents Respond On Jagananna Vidya Deevena | Sakshi
Sakshi News home page

జగనన్న విద్యా దీవెన: అన్నా.. మీకు రుణపడి ఉంటాం

Published Thu, Jul 29 2021 7:10 PM | Last Updated on Thu, Jul 29 2021 9:23 PM

Students And Parents Respond On Jagananna Vidya Deevena - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ఆర్థిక కష్టాల్లోనూ చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్మును గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో,  బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. ‘ఉన్నత విద్య.. మెరుగైన సమాజానికి మెట్టు’గా రెండేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న అక్షర యజ్ఞం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  విద్యా దీవెన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే

జీవితకాలం రుణపడి ఉంటాం..
విజయనగరానికి చెందిన విద్యార్థి తల్లి చిప్పాడ లావణ్యకుమారి మాట్లాడుతూ, ‘‘జగనన్నా మా పాప బీఎస్సీ సెకండియర్‌ చదువుతుంది, మా పిల్లలు ఇద్దరూ ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు, వారు ఇంగ్లీష్‌ మీడియంలో చదవడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది. మా పిల్లలకు అన్నీ అందుతున్నాయి, మా పిల్లల భాద్యత మీరే తీసుకుని చదివిస్తున్నారు. మాకు సొంతింటి కల కూడా మీ వల్లే నెరవేరింది, మా అత్తయ్య గారికి వృద్దాప్య ఫించన్‌ వస్తుంది. కోవిడ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ మీరు చేసిన సాయం వల్ల మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. మీరు చేస్తున్న సేవలకు జీవితకాలం రుణపడి ఉంటాను. మా పిల్లల చదువుకు మీరు ఎంతో కృషిచేస్తున్నారు. మా జీవితాలలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా’’ అంటూ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్ధుల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్‌..
పశ్చిమగోదావరి జిల్లా  భీమవరానికి చెందిన బీఎస్‌సీ మూడో సంవత్సరం విద్యార్థి తేజ ప్రకాష్ మాట్లాడుతూ, ‘‘అన్నా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌లు ఇచ్చి పేద, మద్యతరగతి కుటుంబాలలో వెలుగులు నింపారు. అలాగే తండ్రి ఆశయాలతో ఆయన తనయుడిగా మీరు విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు, వీటి వల్ల నాలాంటి విద్యార్ధులు ఎందరో చదువుకుంటున్నారు. నేను బీఎస్‌సీ మూడో సంవత్సరం చదువుతున్నాను, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడిని, మా నాన్న ఎరువుల వ్యాపారం చేస్తారు, నా చదువుకి అయ్యే ఖర్చు గురించి మా నాన్న శ్రమ పడకుండా మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా చదువుకున్నాను.

నేను ఈ రోజు నాలుగు ఉద్యోగాలు సంపాదించాను, ఇన్ఫోసిస్, విప్రో, అరబిందో, హెటిరో లో ఉద్యోగాలు వచ్చాయి, కానీ నేను ఇన్ఫోసిన్‌ ఎంచుకున్నాను. మీరు ఇంగ్లీష్‌ను ప్రాథమిక స్ధాయిలో ప్రవేశపెట్టడం వల్ల ఇంటర్వ్యూలు ఎలా ఎదుర్కోవాలో ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్‌ ఎంత ఉపయోగం అనేది నాకు తెలుసు, మీరు విద్యార్ధుల కోసం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టడం ద్వారా ప్రతీ విద్యార్ధి కూడా ప్రాక్టికల్‌ నాలెడ్జి సంపాదించి బయటికి వస్తారు, వారికి ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్ధుల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్‌.’’ అన్నారు.

చాలా చాలా సంతోషంగా ఉంది.. ధ్యాంక్యూ అన్నయ్యా..
అనంతపురానికి చెందిన విద్యార్థిని రామ లాలిత్య మాట్లాడుతూ, ‘‘జగనన్నా నేను బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నాను, నాకు ఒక అక్క ఉంది, నా బాగోగులు, మంచి చెడ్డలు చూసుకోవడానికి ఒక అన్నయ్య ఉంటే బావుండేది అని అనుకున్నా లేరన్న భాద ఉండేది. కానీ విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో నాలాంటి ఎంతోమంది చెల్లెల్లకు, తమ్ముళ్ళకు ఒక అన్నగా మీరు భరోసానిస్తున్నారు. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా భావిస్తున్నాం.  చదువుకోవాలన్న పట్టుదల ఉండి డబ్బుల్లేక వాళ్ళ ఆశలు వారే నాశనం చేసుకుంటున్న టైంలో మీరు ఇలాంటి పథకాలు పెట్టి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. గతంలో ఎక్కడికి వెళ్ళినా మీ నాన్న పేరు ఏంటనే వారు. ఆయన ఫోన్‌ నెంబర్‌ అడిగేవారు.

కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మ పేరు ఏంటని అడుగుతున్నారు. నిజంగా ఆడవాళ్లకి చాలా ప్రాధాన్యత కల్పించారు. అమ్మ ఒడి కానీ ఏదైనా సరే డైరెక్ట్‌గా అమ్మల అకౌంట్లలో పడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మేమే డబ్బులు కడుతుంటే నా కోసం మా జగనన్న పంపుతున్నారన్న సంతోషం మాకు కలుగుతుంది. ఏపీలో ఉన్న ప్రతీ విద్యార్ధి తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. కోవిడ్‌ టైంలో చాలామంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నేను క్లాసికల్‌ డాన్సర్‌ను, మీరు వారికి కూడా సహాయం చేస్తున్నారని విన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా అన్నయ్యతో మాట్లాడే అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, ధ్యాంక్యూ అన్నయ్యా’’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

అభివృద్ది అమోఘం..
అనంతపురానికి చెందిన విద్యార్ధిని,  మహిచందన మాట్లాడుతూ.. ‘‘సార్, విద్యారంగంలో మీరు చేస్తున్న అభివృద్ది అమోఘం, నేను ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను, అక్కడ ఎంతోమంది విద్యార్ధులకు ఉన్నత చదువులు చదవాలని ఎంతో కోరికగా ఉంటుంది కానీ వారికి అర్ధిక సమస్యల కారణంగా ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. మీరు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా వారంతా మంచి చదువులు చదువుతున్నారు. నాడు నేడు ద్వారా విద్యాసంస్ధల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో ఎన్నడూ చూడలేదు.

ఈ స్ధాయిలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు సార్, దిశ యాప్‌ మహిళలకు, బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మీరు ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. కోవిడ్‌ సమయంలో కూడా మీరు చాలా సమర్ధవంతంగా కట్టడి చేశారు, వ్యాక్సినేషన్‌ కూడా రికార్డు స్ధాయిలో చేసి ఎంతో ఘనత సాధించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి ముఖ్యమంత్రిగా మీకు విద్యార్ధుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్‌’’ అన్నారు

మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి..
గుంటూరుకు చెందిన విద్యార్థి తల్లి పి. అంజనాదేవి మాట్లాడుతూ, ‘‘జగనన్నా మాకు ఇద్దరమ్మాయిలు, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా అన్నా, మా పిల్లలను చదివించడానికి, పెంచిపోషించడానికి చాలా ఇబ్బందులు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనుకున్నా. ఆస్తులు ఇవాళ ఉంటాయి. రేపు పోతాయి, కానీ చదువులయితే ఎక్కడ ఉన్నా బాగా బతకగలరు, నా చిన్న కూతురు ఇంజనీరింగ్‌ మూడో ఏడాది చదువుతుంది, గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 35 వేలు వచ్చేవి, మిగిలినవి కట్టడానికి చాలా ఇబ్బంది పడేదానిని. మీరు సీఎం అయిన తర్వాత ఫుల్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు, పైగా తల్లుల ఖాతాలో వేయడం చాలా సంతోషం.

మేం నేరుగా కాలేజీలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నాం. వసతి దీవెన పథకం ద్వారా పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వారికి కావాల్సిన పుస్తకాలు వారే కొనుక్కుంటున్నారు. పిల్లలు వారి మేనమామ వాళ్ళకి గిఫ్ట్‌ ఇచ్చినట్లుగా ఫీల్‌ అవుతున్నారు. సచివాలయాలలో అన్ని పథకాలు అందుతున్నాయి, నాకు, మా అమ్మకు ఇంటి స్ధలాలు మంజూరయ్యాయి, మా అమ్మకు ఫించన్‌ వస్తుంది. మీరు సీఎంగా వచ్చిన తర్వాత అభివృద్ది, సంక్షేమం చక్కగా చేస్తున్నారు. ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు అన్నా, మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని’’ ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement