ప్రతీకాత్మక చిత్రం
అది కదిరి సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్. అక్కడ పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ తన చాతుర్యంతో ఓ ప్రజాప్రతినిధి అండ సంపాదించారు. పోలీసు శాఖలోని ఉన్నతాధికారులను ఎలా మాయ చేస్తున్నారో గానీ.. ఎక్కడికి బదిలీ చేసినా మళ్లీ అదే స్టేషన్‌కు తిరిగొస్తున్నారు. పైగా ఓ పోలీసు ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండటంతో స్టేషన్‌నే అడ్డాగా చేసుకుని రెచ్చిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యోగంలో చేరే సమయంలో తాము సామాన్యులకు రక్షణగా ఉంటామని ప్రమాణం చేస్తారు. ప్రజలతో ఎలా మాట్లాడాలి.. కేసులను ఎలా పరిష్కరించాలో తగిన శిక్షణ కూడా పొందుతారు. కానీ కదిరి సబ్ డివిజన్ పరిధిలోని ఓ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారి మాత్రం ఇలా చేస్తే తనకేంటి లాభమంటూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులను వేధించే రౌడీలకు, భూ ఆక్రమణదారులకు, మట్కా, గుట్కా ముఠాలకు, గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. ప్రజలను గౌరవించడం అటుంచి తోటి ఉద్యోగులను కూడా వేధిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఆయా స్టేషన్ల అధికారులు చాలామంది బదిలీ కావడం రివాజు. కానీ ఆయన మాత్రం బదిలీ అయినా ప్రజాప్రతినిధుల అండతో కొన్నాళ్లకే యథాస్థానానికి తిరిగొస్తున్నారు.
స్టేషన్‌ను అడ్డాగా చేసుకుని సివిల్ పంచాయితీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నా ఎవరూ చర్య తీసుకునే పరిస్థితి లేదని అక్కడ పనిచేసే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ పేర్కొనడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగించారు. అప్పట్లో వారి ఆశీస్సులతోనే ఇక్కడ పనిచేసినట్లు తెలిసింది. అలాగే టీడీపీ నేతల వద్ద తనకు ఉన్న పలుకుబడితో పలువురు పోలీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇప్పించారనే ప్రచారం కూడా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో ఆ అధికారి యథేచ్ఛగా సెటిల్‌మెంట్లు చేస్తూ స్టేషన్‌లోనే అన్నీ చక్కబెడుతున్నారన్న విమర్శలున్నాయి.
ఇవిగో నిదర్శనాలు
- ఇటీవల ముదిగుబ్బ వ్యక్తికి సంబంధించిన రూ.3 కోట్ల స్థల పంచాయితీకి సబ్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వం వహించారు. రూ.30 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ పంచాయితీ వాయిదా పడింది. తర్వాత కొన్ని రోజులకు ఇదే పంచాయితీని ఓ పార్టీకి చెందిన నేత సెటిల్ చేయడంతో సదరు అధికారి అతనికి ఫోన్ చేసి... ‘ఆ పంచాయితీ చేసినందుకు మీకు రూ.20 లక్షలు అడ్వాన్సు ముట్టిందటగా’ అంటూ ఆరా తీశారు.
- జూలై మొదటి వారంలో కదిరి పట్టణంలోని ఓ ఇంట్లో పేకాడుతున్నట్లు డయల్ 100కు సమాచారం అందింది. తనిఖీకి వెళ్లిన పోలీసు అధికారికి అక్కడ కానిస్టేబుళ్లు పేకాట ఆడుతూ కనిపించారు. అయితే.. పేకాట ఏమీ జరగలేదని, మన కానిస్టేబుళ్లే మద్యం తాగుతున్నారంటూ పై అధికారులకు సమాధానం చెప్పి.. రూ.లక్షల్లో ఉన్న పేకాట సొమ్మును తాను తీసుకెళ్లినట్లు తెలిసింది.
- పట్టణంలోని మట్కా, పేకాట రాయుళ్లు, గుట్కా వ్యాపారులు, స్థానికంగా లాటరీ టికెట్లు ముద్రించి ఫలితాలను వెల్లడిస్తున్న వారికి సదరు అధికారి అండదండలు అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రతినెలా మట్కా నిర్వాహకుల నుంచి రూ.3 లక్షలు, గుట్కా వ్యాపారుల నుంచి రూ.2 లక్షలు, లాటరీ టికెట్లు విక్రయించే ముఠా నుంచి రూ.3 లక్షలు, బస్టాండుకు సమీపంలోని ఓ లాడ్జీలో పేకాటరాయుళ్ల నుంచి రూ. లక్ష మామూళ్లు తీసుకుంటున్నారు. ఇందులో సంబంధిత స్టేషన్ ఉన్నతాధికారులకూ వాటాలు ఉన్నట్లు సమాచారం.
- పట్టణం మీదుగా నిత్యం గ్రానైట్ లారీలు, ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. ప్రైవేటు బస్సుల యజమానుల నుంచి నెలకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి కూడా పెద్ద మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారు.
- గతంలో ఓ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఎర్రచందనం వాహనాలను బోర్డర్ దాటించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment