పారబోసిన ప్రతీ మెతుకుతో మరొకరి ఆకలి తీర్చవచ్చన్న మాట.. విజయనగరంలోని పాలకులు, అధికారులు, దాతల్లో ఓ కొత్త ఆలోచనను పుట్టించింది. ఫుడ్ బ్యాంకుల ఏర్పాటుకు నాంది పలికింది. ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా పేదలకు పట్టెడన్నం పెట్టాలనుకునేవారు ఫుడ్ బ్యాంకులను సంప్రదిస్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని, ఆహారాన్ని సమకూర్చుతున్నారు. పట్టణానికి వచ్చే అభాగ్యులు.. స్థానికంగా నివసించే పేదల ఆకలి తీర్చడంలో భాగస్వాములవుతున్నారు. అన్నదాన క్రతువును నిరంతరాయంగా కొనసాగించేందుకు తమవంతు సహకరిస్తున్నారు.
సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2018 సంవత్సరం జూలై 11న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరంలో రెండు అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు. రూ.5కు భోజనం పెట్టేవారు. మిగతా ఖర్చును ప్రభుత్వం నిర్వాహకులకు చెల్లించేది. అందుకే రోజూ తినేవారి సంఖ్య 125 నుంచి 150 వరకు ఉంటే... లెక్కల్లో మాత్రం 250 నుంచి 300 వరకు చూపించేవారనే ఆరోపణలు అప్పట్లోనే గుప్పుమన్నాయి.
ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా ఉచితంగా అన్నంపెట్టే ఫుడ్ బ్యాంక్‌లు విజయనగరంలో నాలుగుచోట్ల విజయవంతంగా పనిచేస్తున్నాయి. కరోనా తర్వాత గత ఏడాది ఆగస్టు 13 నుంచి రోజూ కనీసం 400 మంది ఆకలి తీర్చుతున్నాయి. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చొరవతో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా వీటిని ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు సహకారం అందిస్తున్నారు. సేవాభావంతో సాగుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: దానాల్లో అన్నదానం గొప్పదనేది నానుడి. అలాంటి బృహత్తర కార్యక్రమాన్ని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఓ యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభధ్రస్వామి చొరవతో ప్రతిపాదించిన ఫుడ్‌బ్యాంకులపై కార్పొరేషన్ పాలకవర్గం తీర్మానం చేసింది. అలా ప్రయోగాత్మకంగా నాలుగు ప్రాంతాల్లో ఫుడ్‌బ్యాంకులు ఏర్పాటయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, కోట జంక్షన్, ఎన్‌సీఎస్ థియేటర్ రోడ్, పోలీస్ బ్యారక్స్ ప్రాంతాల్లో 2021, ఆగస్టు 13వ తేదీ నుంచి నిరాటంకంగా పేదల ఆకలిని తీర్చుతున్నాయి. ఆ ఫుడ్ బ్యాంకుల నిర్వహణకు వీలుగా ఒక్కోటి రూ.85వేల ఖర్చుతో షెడ్‌లను నిర్మించారు. దాతలు అందించే ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌లను ఏర్పాటు చేశారు.
ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు....
నగరానికొచ్చే పేదలెవరైనా సరే ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేకుండా నాలుగు ఫుడ్ బ్యాంకుల్లో ఆహారాన్ని అందిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను పలు స్వచ్ఛంద సంస్థలు తీసుకున్నాయి. కోట కూడలి వద్ద గల ఫుడ్‌బ్యాంక్‌ను హోటల్ అసోసియేషన్, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఫుడ్‌బ్యాంక్ పంచముఖ ఆంజనేయస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎన్‌సీఎస్ థియేటర్ వద్ద గల ఫుడ్‌బ్యాంకును జిల్లా గౌరీ సేవా సంఘం, పోలీస్ బ్యారక్స్ వద్ద గల ఫుడ్‌బ్యాంకు కన్యకాపరమేశ్వరి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో సాగుతోంది. ఈ నాలుగు ఫుడ్‌బ్యాంకుల ద్వారా రోజూ కనీసం 400 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలు, వివా హ వార్షికోత్సవాలు ఇతరత్రా శుభకార్యాల సందర్భాల్లో అన్నదానం చేయాలనుకునేవారికి ఫుడ్‌బ్యాంకుల్లో అవకాశం కలి్పస్తున్నారు.
అక్రమాలకు తావు లేకుండా...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో తెరిచిన రెండు అన్నా క్యాంటీన్‌లు పేదలకు తిండి పెట్టే మాటేమోకానీ పలు అక్రమాలకు నెలవయ్యాయి. విజయనగరం మున్సిపల్ కార్యాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్ష ప్రాంతాల్లోని అన్నా క్యాంటీన్‌లలో రోజూ భోజనం తినే వారి సంఖ్య 125 నుంచి 150 వరకు ఉంటే... లెక్కల్లో మాత్రం 250 నుంచి 300 వరకు చూపించేవారనే అపవాదు మూటగట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం అన్నా క్యాంటీన్‌ల పేరిట హడావుడి చేస్తున్నారు.
దాతల భాగస్వామ్యంతో..
విజయనగరానికి ఏదో ఒక పనికోసం జిల్లా నలుమూలల నుంచి వచ్చే పేదలకు ఉచితంగా ఆకలి తీర్చాలనేది ఫుడ్‌బ్యాంకుల లక్ష్యం. నాలుగు ఫుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా ప్రతిరోజు పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడం శుభ పరిణామం.
– రెడ్డి శ్రీరాములునాయుడు, కమిషనర్, విజయనగరం కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment