సాక్షి,తాడేపల్లి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.
అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్‌ఏ రిపోర్టులు మారిపోయాయని మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి ముద్దాయిలు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని వైస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి ఆవేదన చెందారు.
ప్రెస్‌మీట్‌లో సుగాలి పార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:
పవన్‌కళ్యాణ్ పచ్చి స్వార్థం:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అర్థమైంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబుని నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావుని పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు. పవన్‌కళ్యాణ్‌ను కలిసినప్పుడు కూడా ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని అన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా?.
నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్‌కళ్యాణ్‌కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు.
పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:
మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి అత్యాచారం జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసు వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి. ముద్దాయిలను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.
వీల్ ఛైర్ యాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదు?:
నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో 2025 లో వీల్ ఛైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్ ఛైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్‌ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న వైఎస్ జగన్‌గారు చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే దాకా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


