సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మంగళవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సంఘ్వీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి.
పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ వారికి వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి జగన్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడం ద్వారా నాణ్యమైన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలనూ సీఎం తెలిపారు. అనంతరం సమావేశం వివరాలను దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు.
ఆ వివరాలు.. రాష్ట్ర సమగ్రాభివృద్ధే సీఎం విధానం ముఖ్యమంత్రిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల మీద ఆయనకున్న అవగాహనకు నేను ముగ్థుడినయ్యాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ముఖ్యమంత్రి విధానంగా స్పష్టమవుతోంది. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవ వనరులను తయారుచేయడం ద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఆయనున్నారు.
పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ముఖ్యమంత్రి ముందడుగు వేస్తున్నారు. మా కంపెనీ తరఫున మేం కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామని చెప్పాం. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామని.. తద్వారా మా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని చెప్పాం. కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటుచేయడానికి అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి. పరిశ్రమలకు చక్కటి సహకారం, మద్దతును సీఎం ఇస్తామన్నారు. ఔషధ రంగంలో మా ఆలోచనలను ఆయనతో పంచుకున్నాం. ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది మా లక్ష్యాల్లో భాగం.
ఈ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు విజయ్ పరేఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment