న్యూఢిల్లీ: వివేకా హత్య కేసులో సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు ఇవ్వాళ జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ముందుకు రాగా.. విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ఏం జరిగింది?
ఈ కేసులో తనకు న్యాయ సహాయం కావాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంను ఆశ్రయించాడు దస్తగిరి. తనకు ఆర్థిక స్థోమత లేనందున కోర్టు న్యాయ సాయానికి అడ్వొకేట్ ను కేటాయించాలని కోరాడు. అయితే, వివేకా కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసిందే దస్తగిరి అయినప్పుడు.. అదే నిందితుడు.. బాధితుడు ఎలా అవుతాడని అడిగారు కృష్ణారెడ్డి. వివేకా హత్యపై అసలు ఫిర్యాదు చేసిందే తానని, అందరికంటే ముందు పోలీసులకు తానే ఫిర్యాదు చేసినందున తనను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ లో కోరారు. కేసులో తాను కూడా బాధితురాలినేనని, తాను ఇంప్లీడ్ అవుతానంటూ సునీత పిటిషన్ వేశారు.
సునీత వాదనేంటీ?
దస్తగిరి విషయంలో ఇంప్లిడ్ పిటిషన్ వేసిన సునీత రెడ్డిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ హోదాలో ఇంప్లీడ్ అవుతున్నారని అడిగింది. దానికి తాను బాధితురాలిని అని, ఈ కేసుకు సంబంధించిన ఏ విషయంలో అయినా.. తనను బాధితురాలిగా చూడాలని సుప్రీంకోర్టుకు కోరింది సునీత. కేసుకు సంబంధించి అదనపు సమాచారం ఇచ్చేందుకు మరింత గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఈ పిటిషన్‌ను పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం కేసును హైకోర్టుకు బదిలీ చేయడమే సబబని పేర్కొంది. ఇప్పటికే కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న తెలంగాణ హైకోర్టే పిటిషన్ విచారించడం సరైందని జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం తెలిపింది. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సూచించింది. అయితే సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఇక్కడే పిటిషన్ ను విచారించాలని పట్టుబట్టారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసే సమయంలో వివేకా సతీమణీ, కుమార్తెలను బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించిందంటూ లుథ్రా తెలిపారు.
చివరికి ఏం జరిగింది?
సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనల అనంతరం ఈ కేసు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సునీత బాధితురాలా? లేక ఫిర్యాదుదారా ? దేనికి కాంపిటెంట్ అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment