
స్పీకర్ పోడియం వద్దకు చేరి చిడతలు కొడుతున్న టీడీపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు, చిత్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: శాసనసభ కార్యకలాపాలకు పదేపదే ఆటంకం కలిగిస్తూ సభలో చిడతలు వాయించి స్పీకర్ స్థానం పట్ల అమర్యాదగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్యేలు చినరాజప్ప, గొట్టిపాటి రవి, జోగేశ్వరరావు, పి.జి.వి.ఆర్. నాయుడు, ఆదిరెడ్డి భవానీలను రెండు రోజులు (బుధ, గురువారం) సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
వాటర్ బాటిళ్లతో బల్లలపై బాదుతూ..
శాసన సభ బుధవారం ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యురాలు ఆదిరెడ్డి భవాని మద్య నిషేధంపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో విపక్షం ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని టీడీపీ సభ్యులు నినాదాలకు దిగారు. పోడియంపై చరుస్తూ అమర్యాదకరంగా ప్రవర్తించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ఆదిరెడ్డి భవాని, గొట్టిపాటి రవి, జోగేశ్వరరావు చిడతలు వాయించి సభను అడ్డుకోవడంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ ద్వారా టీడీపీ ఎమ్మెల్యేలను వారి స్థానాల వద్దకు పంపించారు. స్పీకర్ పోడియం వైపు వెళ్లకుండా మార్షల్స్ నిరోధించడంతో వాటర్ బాటిళ్లతో బల్లలపై చరుస్తూ గందరగోళం సృష్టించారు. ఒకదశలో వారి ప్రవర్తన శృతి మించడంతో స్పీకర్ సస్పెండ్ చేశారు. విపక్ష సభ్యుల ప్రవర్తనపై విచారించి తగిన చర్యలను సూచించాలని నైతిక విలువల కమిటీని ఆదేశించారు. సస్పెన్షన్ ప్రకటన వెలువడిన వెంటనే చిరునవ్వులు చిందిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి నిష్క్రమించారు.
బాధ్యతారాహిత్యం..
శాసనసభ గౌరవ, మర్యాదలను టీడీపీ సభ్యులు దిగజారుస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు నిమిషానికి రూ.88,802 చొప్పున ప్రజాధనం ఖర్చవుతోందన్నారు. రోజుకు రూ.53 లక్షలకు పైగా వెచ్చిస్తుంటే సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సరి కాదన్నారు. విపక్షం అజెండా ప్రకారం సభ నడవదన్నారు. సభ్యులను సస్పెండ్ చేసిన రోజు తాను ఎంతో వేదనకు గురవుతానని, రాత్రి నిద్ర కూడా పట్టదని చెప్పారు.
దేవాలయం లాంటి సభలో చిడతలా?
దేవాలయం లాంటి శాసనసభలోకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాదరక్షలు కూడా బయటే విడిచి వస్తారని, అలాంటి చోట చిడతలు వాయించడం ఏమిటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. విపక్షం ఇక శాశ్వతంగా అదేపనికి పరిమితం కానుందని వ్యాఖ్యానించారు.