మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన స్థానిక తహసీల్దార్ సీహెచ్ కృష్ణారావు, డీటీ జి.జగదీశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఎం శేషాచలం, పన్నూరు గ్రామ వీఆర్వో డి.శివారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ దినేష్‌కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మర్రిపూడి మండలంలోని పన్నూరులో సర్వే నంబర్ 12–2, 169–1, ఇతర సర్వే నంబర్లలో 143.29 ఎకరాల పట్టా భూమికి ఆ గ్రామ వీఆర్వోతో పాటు ఆర్ఐ కలిసి రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండా ఫ్యామిలీ ట్రీ అనే ఒక పత్రం తయారు చేసి అసలైన వారసులకు కాకుండా సంబంధం లేని 65 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసేందుకు సిఫారసు చేశారు.
అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డీటీ జగదీశ్వరరావు కూడా పూర్తిగా పరిశీలించకుండా పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. ప్రస్తుత తహసీల్దార్ కృష్ణారావు కూడా వాటిని వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసిన భూముల్లో 71.75 ఎకరాలను వారం రోజుల్లోనే వీఆర్వో శివారెడ్డి బంధువుల పేర్లమీద రిజి్రస్టేషన్ చేశారు. దీనిపై హక్కుదారులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు భూముల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డు వెళ్తున్నందున రెవెన్యూ అధికారులంతా కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మొత్తం అంశంపై కనిగిరి ఆర్డీవోతో విచారణ చేపట్టిన కలెక్టర్..ఆర్డీవో ఇచ్చిన నివేదిక ప్రకారం భూ అక్రమాలు జరిగినట్లు గుర్తించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. ఆ భూములకు సంబంధించి 91 మంది వారసులు ఉండగా, వీఆర్వో శివారెడ్డి తన బంధువుల పేర్ల మీద అక్రమంగా రిజి్రస్టేషన్ చేయించుకున్నారని, అందుకు మిగతా రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపి సహకరించారని తేలడంతో నలుగురు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment