ఓట్లు వేయలేదని పింఛన్ల నిలిపివేత | Suspension of pensions for not voting | Sakshi
Sakshi News home page

ఓట్లు వేయలేదని పింఛన్ల నిలిపివేత

Published Fri, Aug 2 2024 4:41 AM | Last Updated on Fri, Aug 2 2024 4:41 AM

Suspension of pensions for not voting

నిలదీసిన దళితులపై దాడి 

పోలీసులకు ఫిర్యాదు

పుంగనూరు: టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంగా వృద్ధ దళిత మహిళలకు పింఛన్లు ఆపేశారు. ఇదేమని నిలదీసినందుకు కులం పేరుతో దూషించడమేగాక వారిపై దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మీర్జేపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మీర్జేపల్లికి చెందిన చెన్నమ్మ, రామయ్య, అమరక్క, మునెమ్మ, గంగమ్మ, సరస్వతి అనే దళిత మహిళలకు గురువారం పింఛన్‌ నిలిపివేశారు. 

దీంతో వారంతా కలసి పంచాయతీకి వెళ్లి పింఛను చెల్లించాలని కార్యదర్శిని కోరారు. దీంతో టీడీపీకి చెందిన నాగరాజు, గిరి తదితరులు వారిని కులం పేరుతో దూషించి.. మా ఇష్టం వచ్చిన వారికే పెన్షన్‌ ఇస్తాం. మీరు మా పార్టీకి ఓట్లు వేశారా అంటూ దాడి చేసి కొట్టడమే కాకుండా మీ అంతు చూస్తామని బెదిరించారని వృద్ధ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

కాగా.. ఓట్లు వేయలేదనే కారణంతో మీర్జేపల్లి నుంచి నాయకురాళ్లపల్లి, బసివినాయునిపల్లె తదితర బీసీ కులస్తులు ఉన్న  గ్రామాలకు వెళ్లే రోడ్డుకు గత నెలలో గొయ్యి తవ్వించి రాకపోకల్ని ఆపేసిన విషయం విదితమే.

దళిత నేతల ఆగ్రహం
మీర్జేపల్లిలో పెన్షన్‌ అడిగిన దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలని మాల మహానాడు కార్యదర్శి ఎన్‌ఆర్‌ అశోక్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పుంగనూరులో మీడియాతో విలేకరులతో మాట్లాడుతూ మీర్జేపల్లిలో దళితులను, బీసీలను తిరగనివ్వకుండా రోడ్లను తవ్వేసి అడ్డగిస్తున్నారని, పెన్షన్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

పింఛన్‌ నిలిపేయడంతో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
వేధించిన టీడీపీ నాయకులు
గత నెలలో 3 రోజులు తిప్పించుకుని పింఛన్‌ ఇవ్వని వైనం
ఈ నెల జాబితాలోనూ పేరు లేదన్న టీడీపీ నేతలు
మనస్తాపంతో విషం తాగిన బాధితుడు.. పరిస్థితి విషమం
కంబదూరు: పింఛన్‌ నిలిపివేయడంతో ఓ దివ్యాంగుడు పురుగు మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కుర్లపల్లిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.కుర్లపల్లికి చెందిన వడ్డే శ్రీనివాసులు దివ్యాంగుడు. భార్య గోవిందమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసులుకు 86 శాతం వైకల్యం ఉండటంతో ఏ పనీ చేయలేడు. దీంతో భార్య గోవిందమ్మ కంకర కొట్టి కుటుంబాన్ని పోషిస్తోంది. వీరి పరిస్థితి గుర్తించిన ప్రభుత్వం కొన్నేళ్లుగా శ్రీనివాసులుకు పింఛన్‌ అందిస్తోంది. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక టీడీపీ నాయకులు కమ్మ కిష్టయ్య, కమ్మ కృష్ట తదితరులు దివ్యాంగుడైన శ్రీనివాసులుపై వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడన్న ముద్రవేసి కక్షగట్టారు. జూలై నెలలో పెంచిన పింఛన్‌ శ్రీనివాసులుకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో శ్రీనివాసులు టీడీపీ నాయకుల్ని సంప్రదించగా.. మూడు రోజులు తిప్పించుకుని అర్హుల జాబితాలో పేరు లేదని జూలై నెలకు సంబంధించిన పింఛన్‌ ఎగ్గొట్టారు. తాజాగా గురువారం కూడా ఆగస్టు నెల పింఛన్‌ కోసం వెళితే జాబితాలో పేరు లేదని టీడీపీ నాయకులు చెప్పారు. 

ఏ ఆధారం లేని తనపై కక్ష గట్టడం తగదని, పింఛన్‌ సొమ్ము ఇవ్వాలని శ్రీనివాసులు ప్రాథేయపడినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంతో  అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియడంతో సచివాలయ సిబ్బంది హడావుడిగా కళ్యాణదుర్గం ఆస్పత్రికి వెళ్లి ఆగస్టు నెల పింఛన్‌ సొమ్మును అందజేశారు. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఇప్పుడెలా పింఛన్‌ ఇచ్చారని శ్రీనివాసులు భార్య గోవిందమ్మ ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

వలంటీర్‌పై కక్ష సాధింపు.. పూరి గుడిసె కూల్చివేత
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ దురాగతం
సత్తెనపల్లి : తెల్లారకముందే ఇంటికి వచ్చిమరీ పింఛన్‌ ఇచ్చిన వలంటీర్‌పై కూటమి నేతలు కక్షగట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదన్న కారణంతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వలంటీర్‌ పూడిగుడిసెను కూల్చివేసి భార్యాబిడ్డలకు నిలువనీడ లేకుండా చేశారు.  పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్‌ కంటూ బ్రహ్మయ్య గ్రామంలోని పోరంబోకు స్థలంలో పూరి గుడిసె వేసుకుని చిన్నపాటి టీ హోటల్‌ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 

వలంటీర్‌గా పార్టీలకతీతంగా సేవలందించిన బ్రహ్మయ్యను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయాలని  ఆ పార్టీ నేతలు గతంలో కోరారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు.  దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామ టీడీపీ నాయకులు ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లో లేని సమయంలో 20 ట్రాక్టర్ల మట్టి పోసి ఇంట్లోకి దారి లేకుండా చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎన్టీఆర్‌ విగ్రహం పున:ప్రతిష్ట చేసి ఇక్కడ పార్కుగా అభివృద్ధి చేయదల్చుకున్నామని తక్షణమే ఇంటిని కూల్చివేయమన్నారు. 

కనీసం నాలుగు నెలలు సమయం ఇవ్వాలని కోరగా పట్టించుకోకపోగా, స్థానిక టీడీపీ నేతలు బుధవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ ప్రసాద్‌ను కలిసి బ్రహ్మయ్య ఇల్లు ఖాళీ చేయించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆగమేఘాల మీద బుధవారం అర్ధరాత్రి టీడీపీ నాయకులు పూరి గుడిసెను తొలగింపజేశారు. గ్రామస్తులు అక్కడ గుమికూడి టీడీపీ చర్యలపై ముక్కున వేలేసుకున్నా పూరి గుడిసె కూల్చేసే వారి ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. దీంతో వలంటీర్‌ బ్రహ్మయ్య, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు వీధినపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement