కాకినాడ రూరల్: కల్యాణం... కమనీయమంటారు పెద్దలు. పచ్చని పందిళ్లు.. ముత్యాల తలంబ్రాలు, వేద మంత్రాలు, భాజా భజంత్రీలు, కన్యాదానం, మాంగళ్యధారణ ఇలా... వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కలకాలం గుర్తుండిపోతుంది. అయితే అన్నింటి కంటే భిన్నంగా సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి స్వరూపం గోమాత కల్యాణం జరిగితే అది మధురానుభూతే. గోమాత సారణ కల్యాణోత్సవం ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల ఆసుపత్రి వైద్యుడు గౌరీశేఖర్, రమాదేవి దంపతులు తమ పెంపుడు గోవు సారణకు స్వయంవరం ప్రకటించారు.
దీంతో ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద కొండ తిమ్మాపురంలోని నాడీపతి గోశాల ఆవరణలోని 89 నందీశ్వరులు (గిత్తలు)ను తొలుత ఎంపిక చేశారు. వాటి నుంచి 24కు కుదించారు. మళ్లీ ఇందులో 16ను ఎంపిక చేయగా స్వయంవరంలో 10 గిత్తలు పాల్గొన్నాయి. ఇందులో ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన పుంగనూరు గిత్తలు ఉండడం విశేషం. తిరుపతి, కంచి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు తొలుత డాక్టర్ గౌరీశేఖర్, రమాదేవి దంపతులతో విఘ్నేశ్వర, గౌరీ పూజలు జరిపించారు.
అనంతరం స్వయంవరం ప్రకటించగా భైరవ, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, యువరాజు నిద్రవర్మ, యువరాజు మహేంద్ర కన్నయ్య, బుద్ధుడు, మంగరాజు, ధర్మరాజు, షణ్ముఖ కన్నయ్య తదితర పేర్లతో పిలిచే నందీశ్వరులను ప్రవేశపెట్టారు. డాక్టర్ గౌరీశేఖర్ వధువు సారణను తీసుకువచ్చి స్వయంవరంలో నందులు వద్ద ఉంచగా వాటిని పరీక్షించి మధ్యలో ఉన్న షణ్ముఖ కన్నయ్యను ఎంపిక చేసుకుంది. షణ్ముఖ కన్నయ్య తరఫున తల్లిదండ్రులుగా పాకలపాటి నారాయణరాజు, సీతాదేవి వివాహ వేడుకను జరిపించారు. వరుడు కాళ్లను డాక్టరు గౌరీశేఖర్ దంపతులు కడిగి వివాహం జరిపించారు. అత్యంత రమణీయంగా జరిగిన వేడుకను భారీగా తరలివచ్చిన ప్రజలు తిలకించారు.
గోమాత లక్ష్మీ స్వరూపం
గోమాత లక్ష్మీ స్వరూపమని, ఎక్కడ గోపూజలు జరుగుతాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యా«తి్మక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువు అన్నారు. ఈ వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గోమాత కల్యాణోత్సవం తలపెట్టిన డాక్టర్ గౌరీశేఖర్ దంపతులు అభినందనీయులన్నారు. నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంవరం ద్వారా గోమాత కల్యాణోత్సవం అరుదు అన్నారు. డాక్టర్ గౌరీశేఖర్ మాట్లాడుతూ తాను సారణను దత్తత తీసుకుని కూతురుగా భావించి ఇప్పుడు కల్యాణోత్సవం జరిపించామన్నారు. ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ సీహెచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment