అధికారులు మాట వినడం లేదు.. ఏం చేయాలో తెలియడం లేదు
అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతోనే విజయవాడకు ముంపు
అందరికీ ఆహారం, నీళ్లు అందించలేని పరిస్థితి.. మూడు రోజులుగా పిల్లలకు పాలు, నీళ్లు ఇప్పించలేని దుస్థితి.. ఇంకో రోజు సమయం ఇవ్వండి..
ఇళ్లు దెబ్బతిన్నాయి.. వస్తువులు పూర్తిగా పాడయ్యాయి
ఇళ్లను శుభ్రం చేసే బాధ్యతను ఫైర్ సిబ్బందికి అప్పగిస్తాం
రెండు వారాల్లోగా వాహనాలకు ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్‌లు సెటిల్ చేయిస్తాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతో విజయవాడ నగరం ముంపునకు గురైందన్నారు. ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పని చేయకపోవడంతో రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టే పరిస్థితి తెచ్చారని అన్నారు. అధికారులు తన మాట వినడం లేదని చెప్పారు. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ చేతులెత్తేశారు. ‘మూడు రోజులుగా వరద బాధిత ప్రాంతాల్లో మంచినీళ్లు, ఆహారం, పాలు లాంటి కనీస నిత్యావసరాలు కూడా అందించలేకపోయాం. ఇంకో రోజు సమయం ఇవ్వండి.. మొత్తం సెట్ చేస్తా’ అని అన్నారు. విజయవాడలో ప్రతి కుటుంబం శక్తి మేరకు వంటలు వండి క్యారేజీలు పంపాలని కోరారు.
సీఎం చంద్రబాబు మంగళవారం విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల బాధలు వర్ణనాతీతమని చెప్పారు. బిడ్డను బతికించుకోవడం కోసం భార్య భర్తలు ఒకరినొకరు వదిలేసి రావాల్సి వచి్చందన్నారు. మూడు రోజులుగా పిల్లలకు కనీసం నీళ్లు, పాలు ఇప్పించలేని దయనీయ స్థితి నెలకొందన్నారు. ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారని, వారి మనోభావాలను అధికారులు అర్థం చేసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఓ అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు.
సరిగా పని చేయకుంటే మంత్రులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్ల ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో అందిరికీ ఆహారం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వీలైనన్ని ఎక్కవ డ్రోన్లతో బిల్డింగులపై ఉన్న వారికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బుధవారం సాయంత్రానికి వాటర్ స్కీమ్స్, మెట్రో వాటర్ వర్క్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ, ఆ నీళ్లు తాగడానికి పనికిరావని, వాటి వినియోగంపై ప్రజలకు సూచనలు చేస్తామని అన్నారు. ఫైర్ ఇంజన్లతో ప్రతి ఇంటిని శుభ్రం చేయిస్తామన్నారు.
ఆచూకీ లేని మృతదేహాలను వెదికి, పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. డ్రోన్లు, సెల్‌ఫోన్లు ఉపయోగించి దెబ్బతిన్న పంటలు, వరదల్లో మునిగిన వాహనాల నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. బ్యాంకర్లు, ఇన్సూ్యరెన్స్ కంపెనీలతో సమావేశమై వాహనాలకు రెండు వారాల్లో క్లైయిమ్‌లు సెటిల్ చేయిస్తామని తెలిపారు. విధుల్లో చనిపోయిన విద్యుత్ లైన్‌మేన్ కుటుంబానికి డిపార్ట్‌మెంట్ రూ.20 లక్షలు, ప్రభుత్వం రూ.10 లక్షలు
అందిస్తుందన్నారు.
అప్పుడు వలంటీర్లు అనవసరం..ఇప్పటికిప్పుడు అత్యవసరం
సాక్షి, అమరావతి: సచివాలయ వలంటీర్ల సేవలు అవసరమొస్తే గానీ.. సీఎం చంద్రబాబుకు వారు గుర్తు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో వరదల వంటి విపత్తు సమయాల్లో వలంటీర్లు విశేష సేవలు అందించి.. ప్రభుత్వం అందించిన సాయాలను బాధితుల చెంతకు సత్వరమే చేర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజునుంచీ రాష్ట్రంలోని వలంటీర్లకు ఏ ఒక్క పని అప్పగించకుండా.. గడచిన మూడు నెలలుగా వారికి జీతాలు కూడా చెల్లించకుండా.. సీఎం చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థనే పూర్తిగా పక్కన పెట్టేశారు.
విజయవాడ సింగ్‌నగర్, సమీప ప్రాంతాల్లో వరద విలయతాండవం చేయడంతో సోమవారం రాత్రి హడావుడిగా వరద సహాయక చర్యల్లో తక్షణం పాల్గొనాలంటూ అధికారుల ద్వారా ఆదేశాలు ఇప్పించారు. అదికూడా కేవలం విజయవాడ ప్రాంత వలంటీర్లను మాత్రమే రావాలని కోరారు. కాగా.. ఇతర ప్రాంతాల వలంటీర్లు విధులకు హాజరయ్యే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment