చంద్రగిరిలో పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
చంద్రగిరి :మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మీద అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ నేతలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఈ ఫిర్యాదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ ఆయన సతీమణి భారతమ్మ మీద తప్పుడు పోస్టులు పెట్టి జగన్ అభిమానుల మనసు బాధపడేలా చేశారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలోని కొంతమంది తమ పార్టీ పేరుతో ఫేక్ ఐడీలతో అధికార పార్టీపై ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే, అధికార యంత్రాంగం తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదుచేసి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కొంతకాలంగా తమ అధినేత జగన్‌పై జుగుప్సాకరంగా పోస్టులు పెడుతూ, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు మండిపడ్డారు. నిజానికి.. సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా వికృత చేష్టలపై కూడా చర్యలు తీసుకుని, వారి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సంస్కారం కాదన్నారు. ఇకనైనా ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఐ సుబ్బారామిరెడ్డిను వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment