బాపట్ల అర్బన్: టీచర్ల వల్లే విద్యార్థులకు మంచి భవిష్యత్ లభిస్తుందని.. వారి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీచర్లను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మెరుగైన చదువులు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మంగళవారం బాపట్లలో పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వివరించారు.
టీచర్లంతా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుని.. విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించేలా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్పొరేట్ స్కూళ్ల కంటే గొప్పగా ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల విద్యుత్ బిల్లులను సమగ్ర శిక్షా కార్యాలయం నుంచే చెల్లిస్తారని.. విద్యుత్ విషయంలో ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తారన్నారు. సమగ్ర శిక్షా ఎస్‌పీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి బ్యాచ్‌లో 1,450 మంది హెచ్‌ఎంలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, బాపట్ల కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఆర్డీవో జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment