CM YS Jagan Asks Officials To Take Up Road Repairs On Priority - Sakshi
Sakshi News home page

Govt Of Andhra Pradesh: రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ

Published Sat, Jul 31 2021 2:53 AM | Last Updated on Sat, Jul 31 2021 11:39 AM

Take Up Road Repairs On Priority CM YS Jagan Tells Officials - Sakshi

సాక్షి, అమరావతి: నగరాలు, మునిసిపాలిటీల్లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు, ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)’  కార్యక్రమంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం వచ్చే నెల నుంచి క్లాప్‌ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా రోడ్లు, వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రోడ్ల మరమ్మతులకు వీలుండదని, వర్షాకాలం ముగియగానే ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులను ప్రాధాన్యతగా చేపట్టాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత నెలకొల్పడంలో భాగంగా నగరాలు, పట్టణాల్లో కన్‌స్ట్రక్షన్, డిమాలిషన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇప్పటికే ప్లాంట్లు ఉన్నాయని.. రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రత విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలను భాగస్వాములు చేయాలని సీఎం సూచించారు. 
 
ప్రజలకు చేరువలో రిజిస్ట్రేషన్‌ సేవలు 
గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనివల్ల ప్రతి 2 వేల జనాభాకు ఒక రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వస్తుందని, తద్వారా ప్రజలకు అత్యంత చేరువలో సేవలు లభిస్తాయని చెప్పారు. ఆ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భూములపై తగిన పర్యవేక్షణ ఉంటుందని.. ఆక్రమణలు, అన్యాక్రాంతాలకు ఆస్కారం ఉండదని అన్నారు. విశాఖపట్నంలో బీచ్‌ కారిడార్, మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్, నేచురల్‌ హిస్టరీ పార్క్, మ్యూజియం, తదితర ప్రాజెక్టులపై సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యకలాపాలు, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  
 
అర్హత ఉన్న వారందరికీ ఇంటి స్థలం 
అర్హులైన పేదలందరికీ 90 రోజుల్లో ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పేద కుటుంబాలు ఇంటి స్థలం కోసం మధ్యవర్తులు, ఇతరులు, ఇతర మార్గాల మీద ఆధార పడాల్సిన అవసరంలేని పరిస్థితిని తీసుకొచ్చాం. 
ఉల్లంఘనలు, ఆక్రమిత ప్రాంతాల్లో కనీస సదుపాయాలులేని పరిస్థితి ఉండకూడదని భారీ ఎత్తున 30 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశాం. తొలి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రాంరభించాం. దీనికోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. 
అర్హులైన వారు రాజమార్గంలో పట్టా తీసుకునే పరిస్థితిని సృష్టించాం. ఆక్రమిత ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునే వారిని నెట్టివేసే పరిస్థితులను పూర్తిగా తీసివేశాం. పేదవాడికి ఇంటి స్థలం లేదని మన దగ్గరకు వచ్చినప్పుడు అర్హుడైతే చాలు 90 రోజుల్లోగా వెంటనే ఇంటి పట్టాను మంజూరు చేస్తున్నాం.  
ఈ సమీక్షా సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

 
వేగంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు 
గత ప్రభుత్వం విజయవాడ, గుంటూరు, నెల్లూరులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను అసంపూర్తిగా విడిచి పెట్టింది. ఈ పనులను పూర్తి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. వైఎస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణం కూడా సకాలంలో పూర్తి చేయాలి.   
మంగళగిరి– తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సిఫార్సులు చేసిన నేపథ్యంలో ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదిస్తున్నాం. ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి. 
 
షెడ్యూలు ప్రకారం టిడ్కో ఇళ్లు  
నిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కో ఇళ్లు పూర్తి కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి పెట్టాలని చెప్పారు. మొదటి విడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలోని 85,888 ఇళ్లలో సుమారు 45 వేలకుపైగా ఇళ్లను మూడు నెలల్లో, మిగిలిన ఇళ్లు డిసెంబర్‌లోగా అప్పగిస్తామని అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించేటప్పుడు అన్ని రకాల వసతులతో ఇవ్వాలని, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు.  
  
మహిళా మార్ట్‌ నిర్వహణ అభినందనీయం 
పులివెందులలో పైలట్‌ ప్రాజెక్టుగా మహిళా సంఘాల సహాయంతో మార్ట్‌ నిర్వహణ పట్ల సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. తక్కువ ధరలకు సరుకులు అందిస్తుండటం మంచి పరిణామం అన్నారు. ఒక్కో మహిళ నుంచి రూ.150 చొప్పున 8 వేల మంది మహిళా సంఘాల సభ్యుల నుంచి సేకరించిన డబ్బుతో మార్టు పెట్టామని అధికారులు వివరించారు. మెప్మా దీనిపై పర్యేవేక్షణ చేస్తుందని, మెప్మా ఉత్పత్తులు కూడా ఈ మార్ట్‌లో ఉంచామని తెలిపారు. మార్ట్‌ పనితీరుపై అధ్యయనం చేసి.. మిగతా చోట్ల కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించారు.  

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) నిర్వహణ ఇలా..
నగరాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 124 మునిసిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో 1.2 కోట్ల డస్ట్‌ బిన్‌లు (చెత్త బుట్టలు) ఏర్పాటు. 40 లక్షల ఇళ్లకు ఇంటికి మూడు చొప్పున గ్రీన్, బ్లూ, రెడ్‌ కలర్స్‌లో బిన్‌లు. 
వ్యర్థాల సేకరణకు 4,868 వాహనాలు. ఇందులో 1,771 ఎలక్ట్రిక్‌ వాహనాలు. మొదటి దశలో 3,097 వాహనాల ఏర్పాటు. 
225 గార్బేజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ స్టేషన్లు. సేకరించిన వ్యర్థాలను వివిధ విధానాల్లో ట్రీట్‌ చేసేలా ఏర్పాట్లు. సేకరించిన వ్యర్థాల్లో 55 నుంచి 60 శాతం వరకు తడిచెత్త ఉంటుంది. దీన్ని బయోడిగ్రేడ్‌ విధానంలో ట్రీట్‌ చేస్తారు. 35 నుంచి 38 శాతం వరకు ఉన్న పొడిచెత్తను రీసైకిల్‌ చేస్తారు. మిగిలిన దాన్ని సిమెంట్‌ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఇసుక రూపంలో ఉన్న దానిని ఫిల్లింగ్‌కు వాడతారు.  
72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు. ఆగస్టు 15 నాటికి టెండర్ల ప్రక్రియ, 2022 జూలై నాటికి ఏర్పాటుకు కార్యాచరణ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement