TDP Activists Attack on Women Commission Chairperson Vasireddy Padma, Details Inside - Sakshi
Sakshi News home page

బాబు అండ్‌ బ్యాచ్‌ గూండాగిరి: మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌పై దాడి

Published Fri, Apr 22 2022 12:17 PM | Last Updated on Tue, Apr 26 2022 8:54 PM

TDP Activists Attack on Women Commission Chairperson Vasireddy Padma - Sakshi

లబ్బీపేట (విజయవాడ తూర్పు):  విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టీడీపీ నేతలు గూండాగిరికి తెగబడ్డారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడమే కాక, బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలో ఆమెపై టీడీపీ మహిళలు వీరంగం సృష్టించారు. ఇక మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అయితే చంద్రబాబు సమక్షంలోనే ‘నో ర్ముయ్‌’ అంటూ పద్మపై తిట్ల పురాణం అందు కున్నారు. టీడీపీ దాష్టీకానికి అత్యాచార బాధితురాలితో పాటు, ఆస్పత్రి సిబ్బంది సైతం భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ నేతల అరుపులు, కేకలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది.

వివరాలివి.. 
రెండ్రోజుల కిందట విజయవాడ వాంబే కాలనీకి చెందిన బుద్ధిమాంద్యం యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడగా, ప్రస్తుతం ఆ యువతి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలిని పరామ ర్శించేందుకు శుక్రవారం మ.12 గంటల సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు. ఆమెను ఆస్పత్రిలోకి వెళ్లనీయకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నేతృత్వంలో మహిళా నాయకురాలు పంచు మర్తి అనురాధ తదితరులు అడ్డుకుని దాడికి యత్నించారు.

బాధితురాలిని పరామర్శించి, ఆమెకు అండగా ఉండేందుకు వస్తే అడ్డు కోవడం ఏమిటంటూ వారిని తోసుకుంటూ అతికష్టం మీద వాసిరెడ్డి పద్మ ఆస్పత్రిలోకి వెళ్లారు.  బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరా మర్శిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో భయభ్రాంతులకు గురిచేస్తూ దాడిచేశారు. ఇలా దాదాపు అర గంటపాటు పంచుమర్తి అనురాధ, బొండా   అనుచర గణం దౌర్జన్యకాండ కొనసాగింది.  

చంద్రబాబు సమక్షంలోనే వీరంగం
ఇక మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలోనే చంద్రబాబు అక్కడకు రావడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అప్పటిదాకా ఓ పక్కన నిల్చున్న టీడీపీ కార్యకర్తలను బొండా ఉమా రెచ్చగొట్టారు. బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఆమెతో మాట్లాడే అవకాశం ఇవ్వరా? అంటూ బొండా ఉమా అరిచారు. పక్కకు తొలగాల్సిందిగా ‘ఏయ్‌.. లే..’ అంటూ వాసిరెడ్డి పద్మను గద్దించారు. చంద్రబాబు సైతం పద్మతో ‘మీరిప్పుడు ఎందుకొచ్చారు’.. అంటూ బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. దీంతో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ హోదాలో బాధితురాలిని పరామర్శించే బాధ్యతగా వచ్చానని, టీడీపీ నేతల్లా నీచరాజకీయాలు చేయడానికి మందిని వెంటబెట్టుకుని రాలేదని ఆమె చంద్రబాబుకు దీటుగా బదులిచ్చారు.

నోరుపారేసుకున్న బాబు, బొండా
మీకు ఇది పద్ధతి కాదని, రాజకీయాలు ఏమై నా ఉంటే బయట మాట్లాడుకుందామని, బా ధితురాలి దగ్గర ఇలా ప్రవర్తించవద్దని వాసి రెడ్డి పద్మ చంద్రబాబుకు, వారి నాయకులకు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ‘నువ్వేంటి చెప్పేది’ అంటూ పెద్ద గా అరిచారు. పక్కనే ఉన్న బొండా ఉమా సై తం నోర్ముయ్‌ అంటూ నోరు పారేసుకోవడం తో మళ్లీ టీడీపీ మహిళలు అరుపులు కేకలతో వీరంగం వేశారు. తన సమక్షంలోనే మహిళపై తమ నాయకులు అలా ప్రవర్తిస్తున్నా, చంద్ర బాబు కనీసం వారించకుండా, రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపట్ల అక్కడ ఉన్న వారంతా విస్మయానికి గురయ్యారు. ఇక చంద్రబాబు పరామర్శించి వెళ్లగానే ‘మేం ఇక్కడ ఉండలేం.. మా ఇంటికి పంపించేయండి’.. అంటూ బాధితురాలు భయంతో వాసిరెడ్డి పద్మను చుట్టేసుకుంది.

బాధిత కుటుంబీకులే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌తో ప్రత్యేకంగా మాట్లాడతామని కోరడంతో చేసేది లేక టీడీపీ శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో తాను వచ్చిన ఉద్దేశం నెరవేరలేదన్న భావన తో చంద్రబాబు పోలీసులపై చిందులేశారు. అక్కడే ఉన్న పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తో మాట్లాడి తనకు బాధితురాలితో మాట్లాడే అవకాశమిస్తే కొద్దిసేపు ఉండి వెళ్లిపోతానని చెప్పారు. మరోవైపు.. అక్కడ వాతావరణాన్ని చూపిస్తూ ఏయ్‌.. ఓయ్, అంటూ గుడ్లురిమి కేకలేస్తే భయపడతానా? ఇదేనా మీ రాజకీయం? బూతులు తిట్టమని మీ నేత ఉసిగొల్పుతారా? మీరు ఆ మాత్రం కంట్రోల్‌ చేయలేరా? అంటూ పద్మ చంద్రబాబుపై మండిపడ్డారు. అనంతరం చంద్రబాబు బాధితురాలితో మాట్లాడి అక్కడ నుంచి నిష్క్రమించారు.

టీడీపీ నేతల విధ్వంసం
ఇక ప్రభుత్వాస్పత్రిలోని మాత శిశు విభాగం లోపలికి వెళ్లే దారి వద్ద అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు.  .జఅంతేకాక..  అక్కడున్న గ్రిల్స్‌ను సైతం పీకేసి భయానక వాతావరణం సృష్టించారు.

టీడీపీవి నీచ రాజకీయాలు
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన టీడీపీ నీచరాజకీయాలకు పాల్పడుతోందని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలే కానీ, బాధితురాలి సమక్షంలో అరుపులు, కేకలతో రాజకీయం చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఒక గుంపుగా కొంతమంది అవారా బ్యాచ్‌ వచ్చి అరాచకం సృష్టించారన్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధితురాలికి అండగా ఉండేందుకు, పరామర్శించేందుకు వస్తున్న తనను అడ్డుకుంటే, అతి కష్టమ్మీద లోపలికి రావాల్సి వచ్చిందన్నారు. వెనకే ఒక గుంపులా వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాతైనా, వారిని వారిస్తారనుకుంటే ఆయన కూడా అలాగే ప్రవర్తించడం టీడీపీ నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. బొండా ఉమా బెదిరింపులకు ఎవరూ బెదిరేదిలేదని, ఇది మహిళల ప్రభుత్వమన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యాచార ఘటన విషయం తెలియగానే సీరియస్‌గా స్పందించారన్నారు.

బాబు నాడు–నేడు
04–5–2018న..
మనుషులకు భయం ఉండాలి. భయం లేకపోతే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో పోలీసును పెట్టలేం. నేను అందుకే హెచ్చరిస్తున్నా.. భవిష్యత్తులో ప్రతిఒక్క పోలీసు, సిటిజన్‌ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రమశిక్షణ, లా అబైడింగ్‌ (చట్టానికి కట్టుబడి) ఉండాల.

22–4–2022న..
ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతిలేకుండా ఉండే పరిస్థితికి వస్తోంది. దీన్ని అందరం కూడా సీరియస్‌గా తీసుకోవాలి్సన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి్సంది.. ఒక పేద బాధితురాలకు న్యాయం చేయాలి. మీకు సిన్సియారిటీ ఉంటే.. చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే ఒక స్పెషల్‌ కోర్టు వేయండి. నీతి, నిజాయితీ ఉంటే నిరూపించుకోండి. వెయ్యకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడ వదిలిపెట్టం. ఎట్టిపరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. 

బాబు, బొండాకు మహిళా కమిషన్‌ సమన్లు
అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మపై టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగడంపై కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పలువురు నేతలు వాసిరెడ్డి పద్మను ఇష్టానుసారంగా దూషించడం, అత్యాచార బాధితురాలి వద్ద రాజకీయం చేయడం తదితర పరిణామాలను తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై చంద్రబాబు, బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్‌ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 27 ఉ.11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమా స్వయంగా రావాలని వాసిరెడ్డి పద్మ ఆ సమన్లలో ఆదేశించారు. 


చదవండి👉 మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement