తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట  | TDP Activists Internal fight at Palnadu Kodela Sivaram | Sakshi
Sakshi News home page

తెలుగుతమ్ముళ్ల కుమ్ములాట 

Published Fri, Nov 11 2022 4:35 AM | Last Updated on Fri, Nov 11 2022 8:09 AM

TDP Activists Internal fight at Palnadu Kodela Sivaram - Sakshi

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో కుర్చీలతో కొట్లాడుకుంటున్న టీడీపీ నాయకులు

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. గురువారం పార్టీ సంస్థాగత కమిటీ సమావేశం సందర్భంగా మరోసారి నియోజకవర్గంలో నాయకుల వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. మాటలు పెరిగి కుర్చీలతో దాడులు చేసుకున్నారు. గతంలో ఇక్కడ పోటీచేసి ఓటమిపాలైన మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యానంతరం పార్టీ అధిష్టానం ఎవరికీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి  అప్పగించలేదు. దీంతో నియోజకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన కోడెల శివరాం, మాజీ శాసనసభ్యుడు వై.వి.ఆంజనేయులు, తెలుగుయువత నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు (అబ్బూరి మల్లి) ఎవరికివారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గురువారం పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో సత్తెనపల్లిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొండెపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ హాజరయ్యారు.

అప్పటికే మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు తదితరులు కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో ఉన్నారు. కోడెల శివరాం తన వర్గంతో ర్యాలీగా ఎన్టీఆర్‌ భవన్‌ వద్దకు వచ్చి ఇన్‌చార్జిని నియమించకుండా సంస్థాగత కమిటీ నియామకాలు ఏమిటని ప్రశ్నించారు. స్థానికులుకాని వారి సలహాలు అవసరం లేదంటూ నినదించారు. ఈ క్రమంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. పరస్పరం కుర్చీలతో కొట్టుకున్నారు. సమావేశానికి వచ్చిన పరిశీలకులు ఇన్‌చార్జి నియామక విషయం అధిష్టానం చూసుకుంటుందని, ప్రస్తుతం సంస్థాగత కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. 

అయినా గొడవ ఆగకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, ముఖ్య నాయకులు బయటకు వచ్చారు. తెలుగుతమ్ముళ్ల గొడవను కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై శివరాం వర్గీయులు దురుసుగా ప్రవర్తించడమేగాక సెల్‌ఫోన్లు లాక్కున్నారు. దీంతో సమావేశాన్ని కవర్‌ చేయకుండా మీడియా ప్రతినిధులు బాయ్‌కాట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement