పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు | TDP Illegal Case Against Chevireddy Bhaskar Reddy Under POCSO Act In Andhra Pradesh, More Details Inside | Sakshi
Sakshi News home page

పరామర్శకు వెళితే.. చెవిరెడ్డిపై పోక్సో కేసు

Published Wed, Nov 27 2024 5:47 AM | Last Updated on Wed, Nov 27 2024 9:55 AM

TDP Illegal Case Against Chevireddy Bhaskar Reddy: Andhra Pradesh

బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవడమే నేరం

మాజీ ఎమ్మెల్యేపై కూటమి సర్కారు కక్ష సాధింపు  

బాలిక తండ్రిపై పోలీసుల తీవ్ర ఒత్తిళ్లు

20 రోజుల తర్వాత ఫిర్యాదు ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసు నమోదు

సాక్షి, టాస్క్‌ఫోర్స్, సాక్షి, అమరావతి: ఎక్కడైనా అత్యాచారానికి పాల్పడిన నిందితులపై పోక్సో కేసులు పెడతారు! కానీ పరామర్శించేందుకు వెళ్లి న్యాయం కోసం నిలబడిన వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి!! తిరుపతి జిల్లాలో ఓ బాధిత బాలికకు అండగా నిలిచినందుకు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం చంద్రబాబు సర్కారు అరాచక పాలన, దుర్మార్గాలకు పరాకాష్టగా నిలుస్తోంది. అధికార దుర్వినియోగం కూడా రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రవచనాలు వల్లించిన సీఎం చంద్రబాబు రెడ్‌ బుక్‌ పాలనే లక్ష్యంగా సాగుతున్నట్లు ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి.

బాధిత కుటుంబానికి బాసటగా ఉండడం నేరమా?
చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి వస్తుండగా కొద్ది రోజుల క్రితం కొందరు యువకులు దాడి చేసి అపహరించుకుపోయారు. కుమార్తె కోసం గాలిస్తూ వచ్చిన ఆమె తండ్రి ముళ్ల పొదల్లో బాధితురాలిని గుర్తించినట్లు చెప్పా­రు. ‘బడి నుంచి వస్తున్న నా బిడ్డపై దుర్మార్గులు దాడి చేశారు. ముళ్ల పొదల్లో పడవేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డగించి కత్తితో దాడిచేశారు. నీళ్లలో మత్తు బిళ్లలు కలిపి తాగించారు. చేతిపై, కడుపుపై కత్తితో కోశారు. గంటవరకు బాలిక సృహలో లేదు.

నా పరువు పోయినా పరవాలేదు.. పోలీసులు నిందితులను పట్టుకుని స్టేషన్‌కు తెచ్చి ఉరితీయాలి.. అప్పుడే మాకు న్యాయం జరిగినట్లు..’ అంటూ బాధిత బాలిక తండ్రి విలపించాడు (ఆ వీడియో కూడా ఉంది). ఈ ఘటన గురించి తెలియడంతో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే 80 కిలో­మీటర్లు దూరం ప్రయాణించి బాధిత బాలికను, కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ‘అన్న వచ్చాడు.. న్యాయం జరుగుతుంది’ అంటూ అందరి ముందు బాలిక తండ్రి కూడా చెప్పాడు.

కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు రావడం.. పోలీసు అధికారులు రంగంలోకి దిగడంతో బాలిక తండ్రి మాట మార్చారు. ఆయనకు అండగా నిలి­చిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నాగార్జున­రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌­రెడ్డి, మరికొందరిపై దాదాపు 20 రోజుల తర్వాత పోలీసులకు ఆది­వారం ఫిర్యాదు చేశాడు. తన బిడ్డపై ఎలాంటి అఘాయిత్యం జరగకపో­యినా జరిగినట్లు ప్రచారం చేశారని, వైద్యం అందకుండా ఆస్పత్రి వద్ద గందరగోళం సృష్టించారని అందులో పేర్కొన్నాడు. దీనిపై భాస్కర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి మరికొందరిపై పోక్సో, అట్రాసిటీ చట్టాలు, మరి­కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మిగతా మీడియాలోనూ అదే వార్త..
మైనర్‌ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అన్ని పత్రికల్లోనూ, ఛానళ్లలోనూ ఈ ఘటన వార్తలు వచ్చాయి. అయితే కూటమి నేతలు బాలిక తండ్రిపై ఒత్తిడి తెచ్చి  వైఎస్సార్‌సీపీ నాయకులు, సాక్షి, సోషల్‌ మీడియాపై ఫిర్యాదు చేయించారు. తనకు అండగా నిలిచి సాయం చేసిన వారిపైనే ఫిర్యాదు చేయడం ఇష్టం లేదని, అయినా రోజూ స్టేషన్‌కు పిలిచి వత్తిడి చేస్తుండడంతో తప్పలేదంటూ బాలిక తండ్రి మనోవేదనకు గురవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

పరామర్శిస్తే ఇన్ని కేసులా..? 
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల పరంపరకు చెవి­రెడ్డిపై మోపిన ఈ కేసును పరాకాష్టగా చెప్పు­కోవచ్చు. ప్రజల అశాంతికి భంగం కలిగించా­రని.. నేరపూరిత కుట్రకు పాల్పడ్డా­రని ఇలా.. ఏకంగా 11 సెక్షన్ల కింద అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం... బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 352, 352(1), 196(1), 62(2), 353(1), 72(2) రెడ్‌ విత్‌ ఐటీ చట్టం 67ఏ, పోక్సో చట్టం 23(1), ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 3(1), జెడ్, జెడ్‌ సీ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

రాష్ట్రంలో మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా ప్రేక్షకపాత్రే...
రెడ్‌బుక్‌ పాలనతో ఒకవైపు అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి సర్కారు మరోవైపు మహిళలపై యథేచ్ఛగా జరుగుతున్న లైంగిక దాడులు, హత్యాచారాలపై ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఓ బాలికను అపహరించి హత్యాచారానికి పాల్పడి ఐదు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం మృతదేహాన్ని బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయింది. పుంగనూరులో ఓ బాలికను అపహరిస్తే నాలుగురోజుల పాటు చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఓ బాలికపై టీడీపీ నేత లైంగిక దాడికి పాల్పడితే కేసును కప్పిపుచ్చేందుకు యత్నించారు.

పవన్‌ కళ్యాణ్‌ బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్‌లో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తే మూడు రోజుల పాటు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన 115 అత్యాచారాలు, లైంగిక దాడుల కేసుల్లో ప్రభుత్వం తక్షణం స్పందించలేదు. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.  

అరెస్టుకైనా.. పోరాటానికైనా సిద్ధమే 
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి  
⇒ దేవుడు, న్యాయం మా వైపే ఉన్నాయి 
⇒ పరామర్శిస్తే పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసులేంటి? 
⇒ తన కుమార్తెపై దారుణం జరిగిందని తండ్రి చెబితే వెళ్లి పరామర్శించా 
⇒ మెరుగైన వైద్యం అందేలా సహకరించా.. ఆ బిడ్డ గురించి ఎక్కడా మాట్లాడలేదు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్యాయానికి గురైన బాధితులకు అండగా నిలిచినందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని, దాడికి గురైన ఆడబిడ్డను పరామర్శిస్తే తనపై పోక్సో కేసు పెట్టడం ఏమిటని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తాను దేనికీ భయపడనని, అరెస్టుకు, పోరాటానికైనా సిద్ధమేనని  స్పష్టం చేశారు. దేవుడు, న్యాయం తమ వైపే ఉన్నాయని చెప్పారు. బాధితులకు అండగా నిలిచిన తన మీద పోక్సో, ఎస్సీ, ఎస్టీతోపాటు 11 సెక్షన్లతో కేసు పెట్టారని, ఇంత దారుణం ఎక్కడా ఉండదని అన్నారు. జగన్‌ వెంట నడుస్తున్న వారిని భయాందోళనలు గురి చేయాలని కూటమి నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు.

చెవిరెడ్డి మంగళవారం రాత్రి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కుమార్తెపై దారుణం జరిగిందని పాప తండ్రి ఫోన్‌ చేసి చెబితే అక్కడికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచానని చెప్పారు. బాలికపై దాడి చేసిన దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్‌ చేశాడన్నారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే తాను వెళ్లానని తెలిపారు. ఆ బాలికను తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించానన్నారు. 72 కిలోమీటర్లు  వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. బాధ్యతగా ఉండటాన్ని తప్పుగా సృష్టిస్తారా అని మండిపడ్డారు.

ఆ బిడ్డ గురించి తాను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదని, అయినా తనపై తీవ్రవాదుల మీద పెట్టినట్టు కేసు పెట్టారని చెప్పారు. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా అని నిలదీశారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎక్కడికీ వెళ్లనని, పారిపోనని, తన ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేయనని, ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పారు. పాప తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లిపోతే తమ పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి ఆయన్ని తిరుపతి తీసుకువెళ్లి కూతురి దగ్గరకు చేర్చాడని తెలిపారు. అతని మీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారన్నారు.

తాను ఎలాంటి ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయనని, అరెస్టు చేసి శిక్షించాలంటే తాను దేనికైనా సిద్ధమని చెప్పారు.  తాను ఎక్కడైనా ఆ పాప గురించి మాట్లాడినట్లు ఆధారాలు, రికార్డు ఉంటే చూపించాలని, ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలను ఎవరు పరామర్శించినా పోక్సో కేసు పెడతామని ఈ చర్య ద్వారా బెదిరిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తన మీద కేసు పెట్టి రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ నాయకులందరినీ భయపెట్టాలని అనుకుంటున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో భాస్కర్‌రెడ్డితోపాటు పార్టీ నాయకుడు నాగార్జునరెడ్డి కూడా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement