సాక్షి, తాడేపల్లి : టీడీపీకి మరో షాక్ తగలింది. టీడీపీ సీనియర్ నేత, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అనంతరం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
అయితే, 2009లో వెంకటరమణ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఇక, వెంకటరమణతో పాటుగా టీడీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు సయ్యపరాజు గుర్రాజు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వెంకటరమణ మాట్లాడుతూ.. 1999లో వ్యాపారాలు వదులుకుని టీడీపీలో చేరాను. దివంగత నేత వైఎస్సార్‌తోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా బీఫారమ్ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాను. 2014లో నన్ను నామినేషన్ వేయమని చంద్రబాబు చెప్పారు. వేశాక విత్ డ్రా చేసుకోమని బలవంతం చేశారు. ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఎమ్మెల్సీ ఇస్తామని నమ్మించారు. చెప్పుకింద తేలులాగ నన్ను తొక్కిపెట్టారు . నన్ను నమ్ముకున్న కార్యకర్తలను కూడా తొక్కేశారు. మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా గెలిచిన నన్ను లెక్కచేయలేదు. పొత్తులో భాగం అని చెప్పి కామినేని శ్రీనివాసరావుకి టిక్కెట్ ఇచ్చి, నన్ను మోసం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో ఉండకూడదనుకున్నాను. ఇచ్చినమాట నిలపెట్టుకునే వ్యక్తి సీఎం జగన్. బీసీల అభివృద్ధిని జగనే చేయగలడు. సీఎం జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్దం. కారుమూరి నాగేశ్వరరావు నాకు మంచి స్నేహితుడు. పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం. పదవులు శాశ్వతం కాదు, మనం చేసే పనులే ముఖ్యం అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment