గ్రామంలో మోహరించిన పోలీసులు- డీఎస్పీతో కూన రవికుమార్ వాగ్వాదం- ధ్వంసమైన గృహోపకరణాలు,కార్లు
వరుసగా ఎదురవుతున్న పరాజయాలతో కాలు నిలవని అసహనం.. ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాలను తట్టుకోలేని మనస్తత్వం.. ఏళ్ల తరబడి చలాయించిన ఆధిపత్యానికి గండి పడుతూ ఉంటే.. భవిష్యత్తులో తలవంచి నిలబడే పరిస్థితి కళ్లెదుట కనబడుతూ ఉంటే.. ఏం చేయాలో పాలుపోని భయం. ఇవన్నీ కొందరిలో కక్షలను రెచ్చగొడుతున్నాయి. కార్పణ్యాలను ఎగదోస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇటీవల స్థానిక పోరు వరకు ప్రతి దశలోనూ వెక్కిరిస్తున్న ఫలితాలు కసిని ప్రేరేపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికల్లోనూ అపజయం అనివార్యమయ్యేట్టు కనిపిస్తూ ఉంటే.. నాయకులమంటూ తెగ మిడిసిపడ్డ వారిలో ఈర్ష్యాద్వేషాలు బుసకొడుతున్నాయి.
అవి విషమించి దాడులకు దారిచూపుతున్నాయి. గురువారం ఎన్నికల తరువాత ఇటువంటి అరాచక పరిస్థితులే అగుపించి ప్రజలను నిర్ఘాంతపోయేలా చేశాయి. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అనుచర గణాలు గురువారం రాత్రి పెనుబర్తి ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మరళీ కృష్ణ ఇంటిపై దౌర్జన్యానికి దిగడం.. అతడిని బెదిరించి, భయపెట్టి తీవ్రంగా హెచ్చరించడమే కాక, విలువైన ఆస్తులను ధ్వంసం చేయడం చూస్తూ ఉంటే.. పరిస్థితులు ఎటు దారి తీస్తాయోనన్న భయాందోళనలు అందరిలో ముప్పిరిగొంటున్నాయి.
పొందూరు: పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో.. పెనుబర్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణను లక్ష్యంగా చేసుకుని మాజీ విప్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ వర్గీయులు మరణాయుధాలు, కర్రలతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఇప్పటికే సొంత గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన రవికుమార్ ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం ఓటమి తప్పదని వచ్చిన సంకేతాలను జీర్ణించుకోలేక గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై, పంచాయతీ కార్యాలయంపై దాడి చేశారు. ఓటమిని ఎదుర్కోలేక రవికుమార్ దాడులకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పెనబర్తి అలమాజీపేటకు చెందిన తమ వర్గీయులతో కూన రవికుమార్ నేరుగా ఎంపీటీసీ అభ్యర్థి నివాసంపై దాడికి పూనుకున్నారు.
ఉద్దేశపూర్వకంగానే వాగ్వాదానికి దిగారు. అదే అదునుగా కొంతమంది మురళీ ఇంటిపై దాడిచేసి ఏసీలు, గృహోపకరణాలను ధ్వంసం చేశారు. ఖరీదైన రెండు కార్లను పగలగొట్టారు. దీంతో భయాందోళనకు గురైన మురళీ, భార్య ఝాన్సీరాణి(సర్పంచ్) అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమకు ప్రాణభయం ఉందని తెలిపారు. తమతో పాటు వైఎస్సార్‌సీపీ ముఖ్య అనుచరులను చంపేస్తామని భయపెడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో అసహనానికి గురైన రవికుమార్ హత్యలు చేయించేందుకు ప్రయత్నించడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగినప్పటికీ రక్షణ లేకుండాపోయిందని వాపోయారు. ఘర్షణలకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
డీఎస్పీతో కూన వాగ్వాదం
కారులో పెనుబర్తి నుంచి వెళ్తున్న కూన రవికుమార్‌ను డీఎస్పీ మహేంద్ర నిలువరించారు. దీంతో తనను ఆపినందుకు డీఎస్పీతో ఆయన వాగ్వాదానికి దిగారు. రెండేళ్లలో అధికారంలోకి వస్తామని, ఎక్కడున్నా నిన్ను గుర్తుపెట్టుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు.
చదవండి:
పరిషత్ ఎన్నికలు: రెచ్చిపోయిన టీడీపీ నేతలు
కొటియాలో ఒడిశా దౌర్జన్యకాండ..
Comments
Please login to add a commentAdd a comment