సాక్షి, కర్నూలు: కర్నూలు నడిబొడ్డున గాయత్రి ఎస్టేట్‌లో టీడీపీ కార్యాలయం ఉంది. ఇక్కడ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం ప్రతిష్టించనున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పనిలో పనిగా పార్టీ కార్యాలయాన్ని కూడా కాస్త ఆధునికీకరించారు.
అయితే, విగ్రహం పేరుతో వసూలు చేసిన చందాలపై ఆపార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. విగ్రహం ప్రతిష్టాపన పేరుతో జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రూ.50లక్షలు వసూలు చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు ఆపార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు భారీగా చందాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో, పాటు టైల్స్, కిటికీలు, తలుపులు ఇలా ఒక్కొక్కటీ ఒక్కో నేత విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు మండల స్థాయి, గ్రామ స్థాయి నేతల నుంచి కూడా సోమిశెట్టి విరాళాలు సేకరించారని, ఈ మొత్తం రూ.50 లక్షలదాకా ఉందని, ఇందులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా ఖర్చు కాలేదని, మిగిలిన నిధులు సోమిశెట్టి జేబులోకి వెళ్లాయని చంద్రబాబు పర్యటనకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment