అసెంబ్లీలో గవర్నర్‌పైకి ప్రసంగం ప్రతులను విసురుతున్న టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: ఉభయసభల సంయుక్త సమావేశం వేదికగా ప్రతిపక్ష టీడీపీ రాజ్యాంగ వ్యవస్థపై దాడికి బరి తెగించింది. సభా సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను తీవ్రంగా అవమానిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడింది.
మర్యాదను మంటగలిపి..
రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తిస్తున్న పెద్ద మనిషి పట్ల కనీస గౌరవం కూడా లేకుండా టీడీపీ మరోసారి తెంపరితనాన్ని ప్రదర్శించింది. సోమవారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి ఉపక్రమించగా ప్రతిపక్షం ఆటంకాలు సృష్టించి సభా మర్యాదలను కాలరాసింది. అందుకోసం టీడీపీ సభ్యులు ముందస్తు పన్నాగంతో వచ్చినట్టు స్పష్టమైంది. జాతీయగీతం ఆలాపన తరువాత గవర్నర్ ప్రసంగించేందుకు ఉద్యుక్తులు కాగానే టీడీపీ సభ్యులు ఒక్కసారిగా తన స్థానాల నుంచి లేచి ‘గవర్నర్ గో బ్యాక్...’ అంటూ నినాదాలు చేయడంతో ఒక్క క్షణం ఖిన్నుడైన ఆయన అంతలోనే తేరుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు.
అయితే టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌తోపాటు ఇతర సభ్యులు అంతా గవర్నర్‌కు వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుడు బాల వీరాంజనేయస్వామి ముందుగా తన స్థానాన్ని వదిలి ముందుకు వచ్చి కేకలు వేశారు. అయినప్పటికీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో అచ్చెన్నాయుడు తన చేతిలో ఉన్న గవర్నర్ ప్రసంగం కాపీలను చించివేసి గాల్లోకి విసిరారు. అది ఒక సంకేతంగా భావించినట్లుగా టీడీపీ సభ్యులు అందరూ ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. వెల్‌లోకి దూసుకువచ్చి ‘గవర్నర్ గో బ్యాక్... రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, చినరాజప్ప, రామానాయుడు... టీడీపీ సభ్యులంతా పోడియం సమీపంలోకి దూసుకువచ్చారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ వేలు చూపిస్తూ గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం నివ్వెరపరిచింది.
ప్రతులను చింపి గవర్నర్‌పైకి విసిరి..
టీడీపీ సభ్యులు పోడియం మీదకు దూసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ ముందు జాగ్రత్తగా వారి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. పోడియం వైపు వస్తున్న టీడీపీ సభ్యులకు సర్దిచెప్పేందుకు మార్షల్స్ ఎంతో ప్రయత్నించాల్సి వచ్చింది. ఇంతలో టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి నేరుగా ఆయనపైకే విసరడం విభ్రాంతికి గురిచేసింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడంతో మిగిలిన సభ్యులు నిశ్చేష్టులయ్యారు. గవర్నర్ హోదానుగానీ కనీసం వయసును కూడా గౌరవించాలన్న కనీస స్పృహ లేకుండా టీడీపీ సభ్యులు ఆయన్ని తూలనాడటం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది.
ఒక దశలో ఏకంగా పోడియంపైకి దూసుకువెళ్లేందుకు కొందరు సభ్యులు మార్షల్స్‌ను తోసుకుంటూ వెళ్లేందుకు యత్నించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు మంతెన సత్యనారాయణరాజు, బీటీ నాయుడులను మార్షల్స్ బలవంతంగా సభ నుంచి బయటకు తరలించాల్సి వచ్చింది. దీనిపై అచ్చెన్నాయుడు,బుచ్చయ్య చౌదరి తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరోసారి పోడియం వైపు ఉరికేందుకు యత్నించగా మార్షల్స్ వారిని అతికష్టం మీద అడ్డుకున్నారు.
అందుకు నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగాన్ని ముగించుకుని అసెంబ్లీ లాబీ గుండా వెళ్తున్న సమయంలో కూడా టీడీపీ సభ్యులు కనీస సంయమనం పాటించలేదు. గవర్నర్ వెళ్లే మార్గం వద్దకు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ పట్ల టీడీపీ సభ్యులు అమర్యాదకరంగా వ్యవహరించి అవమానించడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవపరచడం, రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారడం టీడీపీకి అలవాటేనని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment