ప్రభుత్వ భూముల్లో పెత్తందారులు పెత్తనం చెలాయిస్తున్నారు. అసైన్డ్ పట్టాలిచ్చారంటూ స్థానికులు, అధికారులను నమ్మించి దర్జాగా అనుభవిస్తున్నారు. పక్కనే ఉన్న మిగులు భూముల్లో దళితులు ఆటస్థలం కోసం చదును చేసుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియో జకవర్గం, బాలాయపల్లి మండల పరిధిలోని రామాపురంలో వెలుగుచూసిన టీడీపీ నేతల ఆక్రమణ పర్వంపై ‘సాక్షి’ ఫోకస్..
సాక్షి, తిరుపతి: రామాపురం పరిధిలో సర్వే నంబర్ 177లో 348.98 ఎకరాల మేతపోరంబోకు భూమి ఉంది. అదేవిధంగా సర్వే నంబర్ 189లో 37.7 ఎకరాల చెరువు పోరంబోకు, సర్వే నంబర్ 178/1, 179, 180లో ప్రభుత్వ, చెరువు పోరంబోకు భూమి ఉంది. కోట్ల రూపాయల విలువచేసే ఈ భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. రామాపురం మారుమూల గ్రామం కావడంతో అప్పట్లో అధికారుల రాకపోకలు పెద్దగా ఉండేవి కావు.
ఇదేఅదునుగా టీడీపీ నేతలు కొద్దికొద్దిగా ఆక్రమించుకోవడం ప్రారంభించారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు అదే గ్రామ పరిధిలోని దళిత, గిరిజనులు ఆ భూములవైపు వెళ్లకుండా అడ్డుకుంటూ వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూ పంపిణీ పథకం కింద స్థానిక దిళత, గిరిజనులను జాబితాలో చేర్చినట్లు సమాచారం. అయితే పెత్తందారులు వారి పేర్లను తొలగించినట్లు స్థానికులు ఆరోపించారు.
పెత్తందార్లను ఎదిరిస్తే సాంఘిక బహిష్కరణే!
పెత్తందారులంతా ఏకమై రామాపురం పరిధిలో ఉన్న ప్రభుత్వ, చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకోవాలో మాట్లాడుకున్నారు. పేరు, పలుకుబడి ఉన్న వారు ఆరు ఎకరాల చొప్పున ఆక్రమించుకుంటే.. వారితో ఉన్న మరికొందరు 1, 2, 3 ఎకరాల చొప్పున ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూమిలో నిమ్మచెట్లు సాగుచేశారు.
పదేళ్ల క్రితం పెట్టిన చెట్లు కావడంతో ప్రస్తుతం పెద్దవయ్యాయి. అక్రమణదారులకు స్థానిక అధికారులు పూర్తిసహాయ సహకారాలు అందిస్తున్నట్టు దళిత, గిరిజనులు ఆరోపిస్తున్నారు. వారిని కాదని ఎదురు తిరిగితే సాంఘిక బహిష్కరణకు గురికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆట స్థలం ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యం
స్థానిక యువకులు కొందరు బీడుగా ఉన్న ప్రభుత్వ భూమి రెండెకరాల్లో క్రికెట్ ఆడుకునేందుకు ఆటస్థలంగా తీర్చుకున్నారు. జీరి్ణంచుకోలేని పెత్తందారులు స్థానిక రెవెన్యూ అధికారులను రెచ్చగొట్టి యువకులపైకి పంపారు. ఆటస్థలాన్ని ధ్వంసం చేశారు.
అదేవిధంగా దళిత, గిరిజనులు కొందరు బీడుగా ఉన్న భూమిలో నిమ్మచెట్లు పెట్టడంతో.. పెత్తందారులు అధికారుల సహకారంతో ఆ చెట్లను పీకించేశారు. సర్వే నంబర్ 177లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొందరు ఏకమై ఇటీవల తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment