సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎస్‌డీసీ)లో కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీమెన్స్ కంపెనీతో ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసులో అప్పట్లో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు సీఐడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్ పేరిట టీడీపీ ప్రభుత్వ పెద్దలు నిధులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయిస్తే సీమెన్స్ కంపెనీ 90శాతం నిధులు వెచ్చించి రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారని ఒప్పందం చేసుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించేశారు. వాటిలో రూ.245 కోట్లను డిజైన్ టెక్, స్కిల్లర్ అనే షెల్ కంపెనీల ద్వారా సింగపూర్‌కు మళ్లించి, వాటిని మళ్లీ టీడీపీ పెద్దల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో ఐటీశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశే ఏపీ ఎస్‌ఎస్‌డీసీ వ్యవహారాలు చూడటం గమనార్హం.
ఈ కేసులో సీఐడీ అధికారులు డిజైన్ టెక్, షెల్ కంపెనీలకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు సన్నిహితుడు, అప్పట్లో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావుతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటి వరకూ ఎనిమిది మందిని అరెస్టు కూడా చేశారు. అప్పట్లో ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఎండీగా ఉన్న శ్రీకాంత్ అర్జాకు సీఐడీ సోమవారం నోటీసు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతం నిధులు సమకూర్చకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వాటా నిధులను అప్పట్లో ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు విడుదల చేశారు. ఆ నిధులే హవాలా మార్గంలో టీడీపీ పెద్దలకు చేరాయి. ఆ తర్వాత శ్రీకాంత్ అర్జా ఎండీగా వచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఈ వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందని నిర్ధారించిన తర్వాత కూడా ఏపీ ఎస్‌ఎస్‌డీసీ ఎండీగా ఉన్న శ్రీకాంత్ అర్జా సందేహాస్పదంగా వ్యవహరించడం గమనార్హం.
సీమెన్స్ ప్రాజెక్టు విషయంలో అంతా సవ్యంగా జరిగిందని ఆయన నివేదిక ఇవ్వడం విస్మయ పరిచింది. ఐఆర్‌టీఎస్ అధికారి అయిన శ్రీకాంత్ అర్జా డెప్యుటేషన్‌పై రాష్ట్రంలో పని చేశారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన ఆయన ప్రస్తుతం రిటైర్ అయి ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన్ని ఈ నెల 9న విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక మలుపు
Published Tue, Mar 7 2023 3:10 AM | Last Updated on Tue, Mar 7 2023 9:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment