ఊరేగింపు చేయకుండా ట్రాక్టర్లు, ట్రక్కులతో అడ్డగింపు
దాడి చేసేందుకు కారం, రాడ్లు, రాళ్లు, కర్రలతో సిద్ధం
టీడీపీకే వంతపాడిన పోలీసులు
నిమజ్జనం విరమించుకున్న వైఎస్సార్ సీపీ మద్దతుదారులు
అచ్చంపేట మండలం గంథశిరిలో ఘటన
నరసరావుపేట: అధికారమే హద్దుగా టీడీపీ బరితెగిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ ఊరేగింపు అడ్డుకున్నారు. నిమజ్జనానికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టారు. కాదని వస్తే సహించేది లేదంటూ కర్రలు, రాళ్లు, రాడ్లు పట్టుకుని దాడులకు సిద్ధపడ్డారు. ఆఖరుకు నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించే అన్నదాన సంతర్పణకు కూడా భక్తులను వెళ్లనీయలేదు.
ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథశిరి గ్రామంలో చోటుచేసుకుంది. వినాయక చవితి పురస్కరించుకుని గ్రామా లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతుదారులు ఎప్పటిలాగానే వినాయకుడి విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తరువాత నిమజ్జనానికి ఇరువర్గాలు ఒకేరోజు అంటే అదివారం అనుమతి కావాలంటూ పోలీసులను కోరారు. పోలీసులు ముందుగా టీడీపీ వారికి అనుమతి ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం డీజే సౌండ్స్, బాణసంచా, తీన్‌మార్ డుప్పులతో గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేసుకున్నారు.
వైఎస్సార్ సీపీ వారిని సోమవారం నిమ జ్జనం చేసుకునేందుకు అనుమతించారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ వర్గీయులు తమ ఇళ్లపై రాళ్లు రువ్వి గులాంలో కారం కలిపి చల్లారని, వైఎస్సార్ సీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.
వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తుండగా..
సోమవారం ఉదయాన్నే వైఎస్సార్ సీపీ వర్గీయులు వినాయకుడిని నిమజ్జనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ వాళ్లు చేసుకున్న విధంగానే డీజే సౌండ్స్, బాణసంచా, తీన్‌మార్ డప్పులను సిద్ధం చేసుకున్నారు. వినాయడిని మండపంలో నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టరుపై ఎక్కించి ప్రధాన వీధిలోనుంచి ఉరేగింపుగా వెళ్లేందుకు సిద్ధపడ్డారు.
అంతే ఉరేగింపునకు వెళ్లకుండా ప్రధాన రహదారికి అడ్డంగా ట్రాక్టరు ట్రక్కులను టీడీపీ వర్గీయులు అడ్డు పెట్టారు. గొడవకు ముందుగానే సిద్ధపడ్డ టీడీపీ వారు తమ పలుకుబడితో అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథబాబు, సీఐ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. టీడీపీ వర్గీయులు కూడా గ్రామోత్సవాన్ని అడ్డుకునేందుకు దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డంపెట్టి అవతలివైపు కర్రలు, రాడ్లతో కాపుకాశారు.
ఉరేగింపు నిర్వహించాల్సిందేనని వైఎస్సార్ సీపీ వర్గయులు కూడా భీష్మించుకూర్చున్నారు. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూడా టీడీపీకే వంత పలకడంతో చేసేది లేక వైఎస్సార్ సీపీ మద్దతుదారులు మేము మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఐదేళ్లు పూజలు నిర్వహించుకుని అప్పుడే నిమజ్జనం చేసుకుంటామంటూ నిమజ్జనోత్సవాన్ని విరమించుకుని వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనంపై నుంచి దించి యథావిధిగా మండపంలో ఉంచారు.
మీరు వేరే దారిన వెళ్లకుంటే కేసులు: లక్ష్మీపతి, అడిషనల్ ఎస్పీ
గ్రామంలో గొడవలు వద్దు. మీకు డీజే పెట్టుకునేందుకు, బాణసంచాతో ఉరేగింపు చేసుకునేందుకు అనుమతి లేదు. వేరే దారిన ప్రశాంతంగా వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. లేకుంటే వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు తప్పవు. భిన్నంగా చేస్తే నిర్వహక కమిటీ పాటు సపోర్టు చేసిన అందరిపై కేసులు నమోదు చేస్తాం. కేసులుంటే వీసాలు కూడా రావు, బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వరు. మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరు చట్టాన్నే మార్చేంత వ్యక్తులేం కాదుగా, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మేం ఇంతమందిమి రావాలా... పంతాలు, పట్టింపులు వద్దు, మేము చెప్పినట్లుగా వినండి. వాళ్లు వద్దన్న దారినే మీరు ఎందుకు వెళ్లాలి, డీజే సౌండ్స్ లేకపోతే వినాయకుడు ఒప్పుకోడా, మర్యాదగా నేను చెప్పినట్లు వేరే దారిని వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. ఈసారికి ఇలా పోనివ్వండి, వచ్చే ఏడాది ఇరువర్గాలను కూర్చోబెట్టి ఎలా చేయాలో ఆలోచిద్దాంలే అని అడిషనల్ ఎస్పీ అన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం నిమజ్జనానికి వెళ్లకుండా వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment