ఆగని టీడీపీ దాష్టీకాలు | TDP Leaders Who Lost Power Are Still Committing Irregularities | Sakshi
Sakshi News home page

ఆగని టీడీపీ దాష్టీకాలు

Published Sat, Oct 10 2020 8:25 AM | Last Updated on Sat, Oct 10 2020 8:56 AM

TDP Leaders Who Lost Power Are Still Committing Irregularities - Sakshi

జిల్లా పరిషత్‌ సమావేశంలో ఇసుక అక్రమ తరలింపుపై నిలదీసిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పైకి వాటర్‌ బాటిల్‌ విసురుతున్న శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఫైల్‌)  

‘చింత చచ్చినా పులుపు చావ లేదన్న’ సామెతను తలపిస్తోంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి జిల్లా నాయకుడి వరకూ అందరూ ఒకే బాటలో పయనిస్తున్నారు. ప్రజాగ్రహంతో అధికారానికి దూరమై ఏడాది దాటినా ఇప్పటికీ అధికారంలో ఉన్నామనే భ్రమలో బతికేస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన దాష్టీకాలను.. అధికారం లేకపోయినా చేయడానికి వారు బరితెగిస్తుండడం విచిత్రం.

ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వంపై బురద చల్లడమే అజెండాగా టీడీపీ జెండాను మోస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇప్పటికీ తాను ఎమ్మెల్యేననే అనుకుంటున్నారో ఏమో కానీ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముద్రించిన లెటర్‌హెడ్‌లతోనే అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ ఇటీవల ఓ దళిత యువకుడిని కులం పేరుతో దూషించడమే కాకుండా దాడికి ఒడిగట్టారు. దీంతో టీడీపీ నేతల దౌర్జన్యకాండలను ప్రజలు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు.  

సాక్షి, రాజమహేంద్రవరం: ఇటీవలే టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మాజీ జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ ఓ దళిత యువకుడిపై చేయి చేసుకోవడం చర్చనీయాంశమైంది. జగ్గంపేటలో జరుగుతున్న రహదారి విస్తరణ పనుల్లో రావులపాలేనికి చెందిన సామాన్య దళిత యువకుడు బీర ధనకృష్ణ పొక్లెయిన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. జగ్గంపేట – కాకినాడ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రెండు దుకాణాలు అధిక వర్షాలకు పడిపోయాయి. ఆ కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్న ధనకృష్ణ విధి నిర్వహణలో ఉండగా.. అతడిపై జ్యోతుల నవీన్‌ దాడికి ఒడిగట్టారు. అతడిని చెంపపై కొట్టారు. కులాన్ని, వృత్తిని కించపరుస్తూ, నానా దుర్భాషలాడారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు జగ్గంపేట పోలీసులు నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. పదిమంది చూస్తుండగా ఓ దళిత యువకుడిని నవీన్‌ బహిరంగంగా కొట్టడమే కాక, ఆ తప్పును కప్పిపుచ్చుకునేలా ప్రజాసమస్యల కోసం ఇటువంటి వాటిని లెక్క చేసేది లేదని, ఎటువంటి కేసులకూ భయపడేది లేదని కాకినాడలో మీడియా సమావేశంలో ప్రకటించడంపై దళిత సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ వంటి ఉన్నత పదవిలో పని చేసిన వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడడమేమిటని పలువురు చర్చించుకుంటున్నారు.   (రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు)

గతంలోనూ ఎన్నో దాడులు 
నవీన్‌ దూకుడు వైఖరి ఇది కొత్త కాదనే చెప్పాలి. జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకుని ఆ పదవికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. జగ్గంపేట మండలం నరేంద్రపట్నం, మల్లిసాల, కాండ్రేగుల గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించేందుకు పంచాయతీ కార్యదర్శి ఓలేటి హనుమంతు వరప్రసాద్‌ ఏర్పాట్లు చేశారు. అక్కడ కాకుండా టీడీపీ నాయకుడి ఇంటి వద్ద పంపిణీ చేయాలని నవీన్‌ కోరడం, పంచాయతీ కార్యాలయం వద్ద అన్ని ఏర్పాట్లూ చేశామని కార్యదర్శి చెప్పినా వినకుండా నవీన్‌ ఆగ్రహంతో ఓలేటిపై చేయి చేసుకోవడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మూడేళ్ల క్రితం టోల్‌ వసూలు కోసం కిర్లంపూడి కృష్ణవరం టోల్‌గేట్‌ వద్ద నవీన్‌ బంధువులను అక్కడి సిబ్బంది ఆపారు. దీంతో నవీన్, ఆయన అనుచరులు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో టోల్‌ప్లాజాలో లూటీ కూడా జరగడం గమనార్హం. ఇలా దూకుడుగా వ్యవహరిస్తేనే రాజకీయ నాయకుడిగా గుర్తింపు లభిస్తుందనుకుంటే ప్రతి నాయకుడు ఇలానే వ్యవహరిస్తారని విజ్ఞులు పేర్కొంటున్నారు.   (ఫేస్‌బుక్‌ నా పరువు తీస్తోంది: దమ్మాలపాటి పిటిషన్‌)

అధికార మదంతో నాడు దౌర్జన్యాలు 
ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచి, అధికారుల పైన, ఉద్యోగుల పైన టీడీపీ నేతలు దాడులకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జిల్లాలో పలువురు తెలుగు తమ్ముళ్లు అధికార మదంతో చెలరేగిపోయారు. ప్రజలపై అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. నవీన్‌ తాజా దాడితో ఆ సంఘటనలను జిల్లా ప్రజలు మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం సాక్షిగా ఇసుక అక్రమ తరలింపును నిలదీసిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ హోదాలో వేదికను అలంకరించిన రెడ్డి సుబ్రహ్మణ్యం వాటర్‌ బాటిల్, నేమ్‌ బోర్డుతో దాడి చేసి, దురుసుగా ప్రవర్తించారు. 

మరోవైపు సోదరుడైన నాటి మంత్రి యనమల రామకృష్ణుడి అండ చూసుకుని యనమల కృష్ణుడు తునిలో అరాచకంగా వ్యవహరించిన విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

కాపు గర్జన సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కూడా అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడ్డారు. 2015 నుంచి 2017 వరకూ సుమారు 50 వరకూ అక్రమ కేసులు బనాయించారు. 

కోన ప్రాంతంలోని హేచరీలపై కృష్ణుడి అనుచరులు దాడులకు పాల్పడి లక్షలాది రూపాయల ఆస్తులు ధ్వంసం చేయడమే కాకుండా, భయానక వాతావరణం సృష్టించడాన్ని ఇప్పటికీ అక్కడి వారు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. 

నాటి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ వేధింపులకైతే లెక్కే లేదని అంటారు. 2015లో పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ రామును దూషించడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనను సస్పెండ్‌ చేయించారు. 2016లో పిఠాపురం ఎంఈఓ శాస్త్రిపై మాట వినలేదంటూ విరుచుకుపడ్డారు. దీంతో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 2018లో గొల్లప్రోలు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శివలక్ష్మితో ఆమె చేతులతోనే డ్రైనేజీలో మురుగును బహిరంగంగా తీయించి తన క్రూరత్వాన్ని చాటుకున్నారు. 

2013లో రాజమహేంద్రవరం వాంబే కాలనీ లబ్ధిదారులకు అప్పటి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు డ్రా తీస్తున్నారు. నాటి రూరల్‌ ఎమ్మెల్యే చందన రమేశ్‌ను పిలవకుండా డ్రా తీయడమేమిటంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, శెట్టిబలిజ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పాలిక శ్రీను డ్రా తీసే టోకెన్ల డబ్బాలను చెల్లాచెదురు చేసి, గలాటా సృష్టించారు. సిటీ ఎమ్మెల్యే రౌతుపై దాడికి ప్రయత్నించారు. స్థానికులు తిరుగుబాటు చేసి రాళ్లు, మట్టితో గోరంట్ల, వాసిరెడ్డి, పాలిక శ్రీనులను తరిమికొట్టారు. 

అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం శహపురంలో 2014లో టీడీపీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారు. పలువురిపై రౌడీషీట్లు కూడా తెరిపించి వేధించారు. 

అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు.. ఆ ప్రజల పైనే అడ్డూ అదుపూ లేకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయినా అదే ఒరవడిని కొనసాగిస్తున్న నవీన్‌ లాంటి నేతల తీరును పలువురు ఖండిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement