హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పిటిషన్
సాక్షి, అమరావతి: అత్యాచారం ఆరోపణలపై తనపై తిరుపతి తూర్పు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండా ఆరోపణల్లో సత్యాలను శోధించకుండా తనపై కేసు నమోదు చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
పోలీసులు తనపై నమోదు చేసిన కేసు సెక్షన్ 173(1)కి విరుద్ధమన్నారు. ఈ మొత్తం ఘటన ‘హనీ ట్రాప్’ గా ఆయన ఆభివర్ణించారు. జూలై, ఆగస్ట్‌ల్లో ఘటన జరిగిందని వరలక్ష్మి చెబుతున్నారని, అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేసిందో మాత్రం చెప్పడం లేదన్నారు.
బెయిల్ మంజూరు చేయండి : మాజీ ఎంపీ నందిగం సురేష్
టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటన కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ నందిగం సురేష్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ కక్షతోనే తనను ఈ కేసులో ఇరికించారని తెలిపారు. 2021లో ఘటన జరిగితే రెండేళ్ల తరువాత తనపై కేసు నమోదు చేశారన్నారు. ప్రస్తుతం తాను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నానని తెలిపారు. తనపై నమోదు చేసిన కేసులో దర్యాప్తు కూడా పూర్తయిందన్నారు. తనపై ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, బెయిల్ మంజూరు సందర్భంగా ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా ఇదే కేసులో జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు అవుతు శ్రీనివాస్‌రెడ్డి కూడా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీ సులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment