ప్రలోభాలకు లొంగి మూడు స్థానాలకు నేతల రాజీనామా
ఒక స్థానం తిరిగి బీద మస్తాన్‌రావుకు ఇచ్చేందుకు కుదిరిన డీల్
మరొకటి లాబీయిస్ట్ సానా సతీశ్‌కు దాదాపు ఖరారు
రేసులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కంభంపాటి
మూడు స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయించే అవకాశం
వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య టీడీపీ ప్రలోభాలకు లొంగి పోయి తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో.. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ మూడు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీకి చెందిన బడా బాబులు పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలవంతులకే వీటిని కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. పలువురు బిగ్ షాట్స్ ఇందుకోసం భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీకి చెందిన బడా బాబులు పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలవంతులకు వీటిని కేటాయిస్తారనే ప్రచారం ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. పలువురు బిగ్ షాట్స్ ఇందుకోసం భారీ ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్యలను టీడీపీ నేతలు ప్రలోభాలతో లొంగదీసుకుని వారి సభ్యత్వాలకు రాజీనామా చేయించారు.
దీని వెనుక భారీ డీల్ జరిగినట్లు గతంలోనే వెల్లడైంది. ఈ నేపథ్యంలో మోపిదేవి, బీద మస్తాన్‌రావు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ ముగ్గురి రాజీనామాలతో ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ముగ్గురి రాజీనామాలను ఆమోదింపజేయడంలో సహకరించినందుకు ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అదనంగా మరింత రాబట్టేలా..
ముగ్గురిని రాజీనామా చేయించేందుకు పెట్టిన ఖర్చుతోపాటు అదనంగా మరింత రాబట్టేందుకు టీడీపీ ముఖ్య నేత పథకం రచించినట్లు తెలిసింది. ఎవరు ఎక్కువ ఆఫర్ ఇస్తే వారికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ రేసులో బీద మస్తాన్‌రావు ముందున్నట్లు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఒకరు వెల్లడించారు. ఎంతైనా ఇచ్చి తిరిగి సీటు దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తన స్థానం పదిలమని మస్తాన్‌రావు ఇప్పటికే సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.
రేసులో ముందున్న సానా సతీష్
టీడీపీలో ఆరి్థకంగా బలవంతులైన నేతలు రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఆరి్థకంగా అండదండలందించిన సానా సతీష్ పేరు దాదాపు ఖరారైనట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కూటమి అధికారంలోకి వచి్చన నాటి నుంచి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ఆయనకు సీటు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకరించినట్లు చెబుతున్నారు.
నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టాలని ఉవి్వళ్లూరుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్, గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై ప్రస్తుతం బీజేపీలో ఉన్న టీజీ వెంకటేష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా సరే భారీ ఆఫర్ ఇస్తేనే సీటు దక్కే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ మూడు స్థానాల్లో ఒకటి బీజేపీకి ఇవ్వనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment