లోకేష్ వాహనాన్ని అడ్డుకున్న దళితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేశవ్
TDP Student Leaders Protest Against Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సొంత పార్టీ సెగ తాకింది. బుధవారం అనంతపురంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం నేరుగా ఆయన ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్దకు చేరుకున్నారు. కళాశాల ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడి వెనుదిరుగుతుండగా ఆయనను కలిసేందుకు ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ప్రయత్నించారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీని రద్దు చేయాలని కోరేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో ఎంత మాత్రం పట్టించుకోకుండా లోకేష్ కారు ఎక్కడంతో అసహనానికి గురైన దళితులు ఆ వాహనం ముందుకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తూ కారును ముందుకు పోనివ్వాలంటూ డ్రైవర్‌కు హుకుం జారీ చేశారు. అదే సమయంలో పార్టీ నేతలు కొందరు జోక్యం చేసుకుని కారుకు అడ్డుగా నిల్చొన్న దళితులను పక్కకు లాగేయడంతో లోకేష్ వాహనం శరవేగంగా అక్కడి నుంచి దూసుకెళ్లింది.
దళితులను అవమానిస్తారా?
సమస్య వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన లోకేష్ తీరుపై ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు సాకే హరి మీడియాతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గంలో దళితులను అవమానపరుస్తూ ఏర్పాటు చేసిన ద్విసభ్య కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసి నియోజకవర్గంలో టీడీపీని మటుమాయం చేస్తామని హెచ్చరించారు.
టీడీపీలోని అగ్రకులాలకు చెందిన కొందరు నేతలు రాజకీయంగా దళితులు, గిరిజనులు ఎదగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దళితులతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదంటే పార్టీలో ఎస్సీ, ఎస్టీల స్థానమేమిటో అర్థమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఏసీ నేతలు శింగంపల్లి కేశవ, ముకుందాపురం నరసింహులు, జైభీమ్‌సేన ఏపీ అధ్యక్షుడు ఆకులేడు ఓబులేసు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment