
సాక్షి, అమరావతి: దావోస్‌లో ఈ నెల 16న మొదలై... 20వ తేదీ వరకు జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023–వార్షిక సదస్సు’లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ, దాని మిత్ర మీడియా చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే ఈ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్టే బ్రెండే స్వయంగా పంపిన లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసింది.
పైపెచ్చు ఈ లేఖ సీఎం వైఎస్ జగన్ కార్యాలయానికి గత ఏడాది నవంబర్ 25నే అందింది. అయితే 6 నెలల కిందటే దావోస్ సదస్సుకు హాజరై ఉండటం... మరోవైపు నెలన్నర రోజుల్లో (మార్చి మొదటి వారంలో) విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై ఫోకస్ పెట్టడం వంటి కారణాల వల్ల ఈసారి దావోస్ సదస్సుకు హాజరు కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఏపీకి దావోస్ సదస్సుకు ఆహ్వానం రాలేదంటూ టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం
ఈ వాస్తవాలు సామాన్యులకు తెలియవనే ఉద్దేశంతో... గడిచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దావోస్‌కు పిలవకపోవటం ఇదే తొలిసారంటూ తెలుగుదేశం భారీ ఎత్తున దుష్ప్రచారానికి దిగింది. కాకపోతే ఇవేమీ... ‘ఈనాడు’ ఇతర ఎల్లో మీడియా చెప్పకపోతే జనానికి వాస్తవాలు తెలియని రోజులు కావు. అందుకే ఎల్లో ముఠా దుష్ప్రచారం ఆరంభమైన వెంటనే... దానికి ప్రతిస్పందనలు కూడా మొదలయ్యాయి.
దావోస్‌లో సదస్సుకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్‌కు వరల్డ్ ఎకానమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్టే బ్రెండే పంపిన లేఖ
నిజానికి ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి సదస్సుకు హాజరై ఉంటే... ‘మొన్ననే 6 నెలల కిందటే కదా దావోస్‌కు వెళ్లింది. మళ్లీ ఇంతలోనే ఏం పెట్టుబడులు తెచ్చేస్తారు?’ అనే రీతిలో కూడా తెలుగుదేశం, ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలెట్టేసేవంటూ ప్రజలు నవ్వుకోవటం విశేషం.