812 అడుగులకు తగ్గిపోయిన శ్రీశైలం నీటిమట్టం | Telangana govt uninterrupted power generation at Srisailam and other projects | Sakshi
Sakshi News home page

812 అడుగులకు తగ్గిపోయిన శ్రీశైలం నీటిమట్టం

Published Fri, Jul 9 2021 3:17 AM | Last Updated on Fri, Jul 9 2021 3:17 AM

Telangana govt uninterrupted power generation at Srisailam and other projects - Sakshi

సాక్షి, అమరావతి/సత్రశాల (రెంటచింతల)/విజయపురి సౌత్‌: కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ.. ప్రాజెక్టుల నిర్వహణ నియమావళిని బుట్టదాఖలు చేస్తూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్‌ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని పెంచడంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక టీఎంసీ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి దాపురించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. శ్రీశైలంలో వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయినా తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని ఆపడం లేదు. గురువారం విద్యుదుత్పత్తి చేస్తూ 8,663 క్యూసెక్కులను వదిలేయడంతో శ్రీశైలంలో నీటిమట్టం 812.14 అడుగులకు పడిపోయింది. నీటి నిల్వ 35.51 టీఎంసీలకు తగ్గిపోయింది. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు శ్రీశైలంలోకి 26.44 టీఎంసీల ప్రవాహం వస్తే.. తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ 25.89 టీఎంసీలను అక్రమంగా తోడేయడం గమనార్హం.

నాగార్జునసాగర్‌లోకి 12,955 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తి చేస్తూ 30,622 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దీంతో సాగర్‌లో నీటిమట్టం 528.97 అడుగులకు తగ్గింది. నీటి నిల్వ 169.32 టీఎంసీలకు పడిపోయింది. పులిచింతల ప్రాజెక్టులోకి 30,361 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 38.74 టీఎంసీలకు చేరుకుంది. దీంతో తెలంగాణ విద్యుదుత్పత్తిని పెంచేసి 10,500 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ఈ జలాలు శుక్రవారం ప్రకాశం బ్యారేజీకి చేరతాయి. దీంతో శుక్రవారం నుంచి రోజూ ఒక టీఎంసీ మేర ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 8,841 క్యూసెక్కులు వస్తుండగా.. 18 గేట్లను అర్ధ అడుగు మేర ఎత్తి 7,470 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేశామని ఈఈ స్వరూప్‌ తెలిపారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 4.44 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలవడం గమనార్హం. 

టెయిల్‌పాండ్‌ ప్రాజెక్ట్‌లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి
కాగా, గుంటూరు జిల్లాలోని సత్రశాల వద్ద నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 30,998 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈ బి.కాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో 50 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌లో గరిష్టస్థాయిలో 7.080 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement