సాక్షి, హైదరాబాద్: సీఐడీ అధికారుల విచారణకు మార్గదర్శి ఉద్యోగులు సహకరించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేంద్ర కార్యాలయ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. తనిఖీలు, విచారణను అడ్డుకునేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మీడియాకు అధికారులు వివరాలు వెల్లడించకుండా కూడా జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మార్గదర్శి కేంద్ర కార్యాలయ ఉద్యోగులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
తనిఖీలు ముగిశాక పిటిషనా?
మార్గదర్శి ఉద్యోగులు గురువారం లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోకుండా నిరోధించాలని, తనిఖీలు నిలిపివేసేలా ఏపీ సర్కార్‌ను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విన్నవించారు.
అయితే బుధవారం ప్రారంభమైన తనిఖీలు గురువారం ఉదయం 9 గంటలకే ముగిశాయని, అలాంటప్పుడు తనిఖీలు ఆపాలని పిటిషన్ దాఖలు చేయడంలో అర్థం లేదని ఏపీ స్పెషల్ జీపీ గోవింద్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సీఐడీ అధికారుల తనిఖీలు ముగిశాయి. ఏ ఉద్యోగిపైనా చర్యలు తీసుకోలేదు. ఎవరినీ బలవంతపెట్టలేదు.. భయపెట్టలేదు. అరెస్టులు చేయలేదు. చట్టప్రకారమే తనిఖీలు జరిగాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు. పలువురు బ్రాంచ్ మేనేజర్లకు, బ్రాంచ్ ఉద్యోగులకు నోటీసులిచ్చాం. కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు’ అని హైకోర్టుకు నివేదించారు.
విచారణలో జోక్యం వద్దన్న ‘సుప్రీం’..
‘ఏ–1 రామోజీరావు, ఏ–2 శైలజ సహా పలువురు మేనేజర్లు ముందస్తు బెయిల్ పొందారు. వారిని కనీసం కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చట్టబద్ధమైన సంస్థలు కేసును విచారించే సమయంలో పూర్తి వివరాలను పరిశీలించకుండా కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు పలుమార్లు ఆదేశాలిచ్చింది. నిహారికా ఇన్‌ఫ్రా. వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుపై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సెక్షన్ 438 సీఆర్‌పీసీ కింద ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వకూడదని పేర్కొంది. పిటిషనర్‌కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి ‘వెకేట్’ పిటిషన్ దాఖలు చేసుకోవాలని ప్రతివాదులను ఆదేశించడం సమర్థనీయం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు ఎలాంటి రిలీఫ్ ఉత్తర్వులు ఇవ్వవద్దు’ అని గోవింద్‌రెడ్డి అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment