సాక్షి, అమరావతి: అంతర్‌రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేద్దామన్న ఏపీఎస్‌ఆర్టీసీ మరో ప్రతిపాదనను కూడా తెలంగాణ ఆర్టీసీ తిరస్కరించింది. ఒప్పందం కుదిరేవరకు డబుల్ పాయింట్ ట్యాక్స్ పర్మిట్ల విధానంలో హైదరాబాద్‌కు బస్సులు తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ.. టీఎస్‌ఆర్టీసీకి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు అంగీకరించబోమని టీఎస్‌ఆర్టీసీ తేల్చిచెప్పింది. తాము నష్టపోయినా టీఎస్‌ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా కిలోమీటర్లను పెంచుకోమని ఏపీఎస్‌ఆర్టీసీ సూచించినా ససేమిరా అంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రయాణికులకు పండుగ ప్రయాణం భారంగా మారింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీల తకరారు ఈ విధంగా ఉంటే ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్మి బస్సులు నడిపితే సీజ్‌చేస్తామని రవాణాశాఖ హెచ్చరించింది.
ఏపీఎస్‌ఆర్టీసీ తాజా ప్రతిపాదనలివే...
►ఏపీఎస్‌ఆర్టీసీ లాక్‌డౌన్‌కు ముందు నడిపే 1,009 బస్సుల వల్ల ఏడాదికి రూ.575 కోట్ల ఆదాయం వచ్చేది. 322 బస్సులు తగ్గించడం వల్ల ఆ ఆదాయంలో రూ.260 కోట్లు తగ్గుతుంది.
►టీఎస్‌ఆర్టీసీ ఏపీ భూభాగంలో 50 వేల కి.మీ. పెంచుకుంటే తెలంగాణ భూ భాగంలో మరో 50 వేల కి.మీ. పెరుగుతుంది. అంటే మొత్తం లక్ష కి.మీ. బస్సుల్ని తిప్పితే కి.మీ.కి రూ.30 వంతున రోజుకు రూ.30 లక్షలు.. నెలకు రూ.9 కోట్లు.. ఏడాదికి రూ.108 కోట్ల మేర ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఆదాయం తగ్గిపోతుంది.
►రోజూ ఏపీ నుంచి హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ ద్వారా 70 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
►ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదు. ఆస్తుల పంపిణీ పూర్తికాలేదు. అంటే సాంకేతికంగా టీఎస్‌ఆర్టీసీ మనుగడలో లేదు. టీఎస్‌ఆర్టీసీ సైతం కర్ణాటక, మహారాష్ట్రలతో అంతర్‌రాష్ట్ర ఒప్పందాలను ఏపీఎస్‌ఆర్టీసీ పేరిటే చేసుకోవాలి.
డబుల్ పాయింట్ ట్యాక్స్ విధానం అంటే..
అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఆర్టీసీ రెండు రాష్ట్రాల్లో పన్ను చెల్లించి పర్మిట్లు పొందడమే డబుల్ పాయింట్ ట్యాక్స్ విధానం. బస్సులో సీట్ల సంఖ్యనుబట్టి ఒక్కో సీటుకు మూడు నెలలకు రూ.3,750 రూపాయల వంతున రెండు రాష్ట్రాల్లోనూ పన్ను చెల్లించాలి. ఒక్కో బస్సుకు సుమారు రూ.1.5 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒప్పందం కుదిరేవరకు ఈ విధానంలో బస్సులు నడుపుదామని, కనీసం పండుగ సీజన్‌లు పూర్తయ్యేవరకైనా ఈ విధానం అమలు చేద్దామని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment